Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మసాలలా పేరుతో విషం.. కాటేదాన్‌లో H-FAST మెగా ఆపరేషన్..!
posted on: Aug 4, 2026 4:15PM
.webp)
చూడటానికి ఆకర్షణీయంగా.. చేతిలోకి తీసుకుంటే బరువుగా.. నాణ్యమైన బ్రాండెడ్ మసాలాల్లా కనిపిస్తున్నాయి.. అంతేకాదు.. ఘుమఘుమ లాడుతూ నోరూరిస్తున్నాయి..! కానీ అవి కూరల్లో వేసుకునే మసాలాలు కాదండోయ్ విషపూరిత రసాయనాలతో తయారు చేసిన కల్తీ మిశ్రమాలు..! ఇలాంటి మసాలాలను దర్జాగా మార్కెట్‌లోకి తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ దందాను H-FAST అధికారులు బట్టబయలు చేశారు. కాటేదాన్ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై H-FAST, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన మెగా ఆపరేషన్‌లో 25.3 టన్నుల కల్తీ మసాలాలు పట్టుబడ్డాయి.
మసాలాల కొనుగోలు, ప్రాసెసింగ్, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్న 13 సంస్థలు, కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాణ్యత లేని ఆవాలు, జీలకర్ర, వాము, లవంగాలు, షాజీరా తదితర మసాలాలకు ఫ్యాబ్రిక్ డైలు, ఇండస్ట్రియల్ కలర్స్, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి ఆహారంలో వినియోగించకూడని పదార్థాలను కలుపుతు న్నట్లు గుర్తించారు. మసాలాలకు రంగు, మెరుపు, బరువు పెంచి బ్రాండెడ్ ఉత్పత్తుల మాదిరిగా తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తు న్నట్లు అధికారులు గుర్తించారు.
దాడుల్లో 7,920 కిలోల వాము, 6,700 కిలోల జీలకర్ర, 4,960 కిలోల ఆవాలు, 2,350 కిలోల జీలకర్ర పొడి, 2,280 కిలోల షాజీరా, 550 కిలోల లవంగాలు, 540 కిలోల సోంపు కలిపి మొత్తం 25,300 కిలోల కల్తీ మసాలాలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా భారీగా ముడి పదార్థాలు, షైనింగ్ పౌడర్, సింథటిక్, ఫ్యాబ్రిక్ డైలు, రైస్ బ్రాన్ ఆయిల్, మూడు రోలింగ్ మెషీన్లను సీజ్ చేశారు.
ఈ వ్యవహారంపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి కాటేదాన్‌కు చెందిన రాహుల్ భాటి, బేగంబజార్‌కు చెందిన విశాల్ పన్వార్, దులీచంద్ కచావర్‌లను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మసాలాలు, రసాయనాలను ల్యాబొరేటరీ పరీక్షలకు పంపించి, నివేదిక ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006తో పాటు ఇతర చట్టాల కింద చర్యలు తీసుకోనున్నారు.
ఇదే ఆపరేషన్‌లో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌లో రసాయనాల వినియోగం, కుళ్లిన మాంసం నిల్వలు, రసాయనాలతో పండ్లను మగ్గించడం, యూరియా, డిటర్జెంట్లు, పామ్ ఆయిల్‌తో సింథటిక్ పనీర్ తయారీ వంటి మరిన్ని కల్తీ వ్యవహారాలు కూడా బయటపడ్డాయి.
H-FAST ఏర్పాటైన 140 రోజుల్లోనే 659 దాడులు నిర్వహించి 202 FIRలు నమోదు చేయడంతో పాటు సుమారు 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అసాధారణంగా ప్రకాశవంతమైన రంగుల్లో కనిపించే మసాలాలు, బ్రాండింగ్ లేని ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని అధికారులు సూచించారు. ప్యాకింగ్, లేబులింగ్, FSSAI లైసెన్స్ వివరాలను పరిశీలించా లని, అనుమానాస్పద కల్తీ వ్యవహారాలు కనిపిస్తే డయల్ 100 లేదా H-FAST హెల్ప్‌లైన్ 8712661212కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. కల్తీ ఆహారంపై తనిఖీలు, దాడులు నిరంతరం కొనసాగుతా యని అధికారులు స్పష్టం చేశారు.
H-FAST mega operation in Katedan, H-FAST, FSSAI, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police






