Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు...డీజీపీకి సీఎం రేవంత్ సూచన
posted on: May 6, 2026 4:44PM

సీఎం రేవంత్ పర్యటన సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్...
డీజీపీపై ముఖ్యమంత్రి ఆగ్రహం..ట్రాఫిక్ నిలిపివేయొద్దని సూచన..
ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ప్రతిసారి ట్రాఫిక్ జామ్...
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీస్ అధిపతి సి.వి. ఆనంద్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం ఢిల్లీ ప్రయాణానికి వెళ్తున్న సమయంలో విమానాశ్రయం సమీపంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కారణంగా సాధారణ ప్రజల దైనందిన పనులకు ఆటంకం కలగకూడదని, ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి వాహనాలు వెళ్లే మార్గంతో పాటు ఎదురుగా వచ్చే వాహనాలను పూర్తిగా ఆపివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశించారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు డీజీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ట్రాఫిక్ సమస్యపై సీఎం పదేపదే మాట్లాడాల్సి రావడం సమస్య తీవ్రతను సూచిస్తోందని, క్షేత్రస్థాయి అధికారులు దీనిని అత్యంత గంభీరంగా తీసుకోవాలని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచేందుకు అదనపు డీజీపీ ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేక ‘ట్రాఫిక్ బ్యూరో’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా, సింగిల్ లైన్ విధానంలో వాహనాలను అనుమతించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
రద్దీ ప్రాంతాల్లో ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని, విమానాశ్రయం పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని, సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్‌ను పూర్తిగా నిరోధించాలని, ఐఎస్‌డబ్ల్యూ, సీఎస్‌డబ్ల్యూ విభాగాలతో సమన్వయం చేస్తూ శాంతిభద్రతల విభాగం కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని డీజీపీ స్పష్టం చేశారు.






