నిప్పుల కొలిమిలా తెలంగాణ

posted on: May 20, 2026 9:04AM

తెలంగాణ నిప్పుల కొలిమిగా మారిపోయింది.  ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. భానుడి భగభగలకు  ఉక్కపోత తోడవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు తీవ్రమైన వడగాల్పుల హెచ్చరికలతో కూడిన రెడ్ అలర్ట్ జారీ చేసింది.

రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని   హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.  

ప్రస్తుతం రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదౌతున్నాయి.  గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్, మోస్రా వంటి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో సైతం ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( పరిధిలోనూ ఎండల ప్రభావం తీవ్రంగానే ఉంది.   నగరంలోని  రద్దీ ప్రాంతాల్లో గరిష్టంగా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ సంచాలకులు సూచిస్తున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు బయటకు రాకుండా ఉండటం మంచిదన్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఎండలో తిరిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. 

ప్రభుత్వ యంత్రాంగం కూడా వడదెబ్బ బాధితుల కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులను సిద్ధం చేసింది. ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. రాబోయే వారం రోజులూ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...