గ‌నుల్లో కాదు.. ల్యాబుల్లో వ‌జ్రాల పంట‌!

posted on: Jun 2, 2026 3:07PM

భారత వజ్ర పరిశ్రమలో ఓ చారిత్రక మలుపు చోటుచేసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో.. భారతదేశం నుంచి ఎగుమతి అయిన పాలిష్ చేసిన ల్యాబ్-గ్రోన్ డైమండ్స్- ఎల్జీడీ  పరిమాణం తొలిసారిగా సహజ వజ్రాల మార్కెట్ ని క్రాస్ చేసింది. సూరత్ కేంద్రంగా వేగంగా విస్తరిస్తున్న ఈ రంగం, కేవలం తయారీ విధానంలోనే కాదు, గ్లోబల్ ఆభరణాల మార్కెట్ స్వరూపాన్నే మార్చే స్థాయికి చేరింది. నామమాత్ర స్థితి నుంచి పదేళ్లలో  సహజ వజ్రాల ఎగుమతులను మించిపోయే స్థాయికి ల్యాబ్ గ్రోన్ వజ్రాలు చేరడం, భారత రత్నాభరణ పరిశ్రమలో భారీ మార్పును సూచిస్తోంది.

ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలకు  సూరత్ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదిగింది. భారతదేశపు కృత్రిమ వజ్రాలలో  90 శాతానికి పైగా ఇక్కడే ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది సూరత్‌కు కొత్త పారిశ్రామిక గుర్తింపును తీసుకొచ్చి పెడుతోంది. ఒకప్పుడు సహజ వజ్రాల కటింగ్, పాలిషింగ్‌కు ప్రసిద్ధి చెందిన సూర‌త్..  నేడు డిజిటల్ కంట్రోల్డ్, ఫాస్టెస్ట్, చీప్ అండ్ బెస్ట్ డైమండ్ మేకింగ్ కి  కేరాఫ్ గా మారింది.

ఈ మార్పు అనుకోకుండా జ‌రిగింది కాదు. ఆధునిక సాంకేతికత, తక్కువ తయారీ ఖర్చులు,  ఎగుమతి మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ వెర‌శీ.. ఎల్జీడీ  రంగాన్ని ఎంతో వేగంగా పైపైకి తీసుకెళ్లాయి. భారత రత్నాభరణ పరిశ్రమ దీని ద్వారా కొత్త శ‌కంలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌ గణాంకాల ప్రకారం, 2025-26లో భారతదేశం 18.8 మిలియన్ క్యారెట్ల పాలిష్ చేసిన ఎల్జీడీలను ఎగుమతి చేసింది. ఇదే కాలంలో సహజ వజ్రాల ఎగుమతులు 16 మిలియన్ క్యారెట్ల ద‌గ్గ‌ర‌ నిలిచాయి. అంటే.. పరిమాణం పరంగా చూస్తే..  ఈ స‌రి కొత్త వజ్ర పరిశ్రమ సంప్రదాయ వజ్ర పరిశ్రమను అధిగమించిందన్న మాట‌.

పదేళ్ల క్రితం ఈ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. 2015-16లో పాలిష్ చేసిన సహజ వజ్రాల ఎగుమతులు 33.51 మిలియన్ క్యారెట్లు కాగా,  ఎల్జీడీ  ఎగుమతులు కేవలం ల‌క్ష‌ క్యారెట్ల పరిమితిలోనే ఉండేవి. ఈ మార్పు, ఒక చిన్న విభాగం నుంచి.. ప్రపంచ స్థాయి పరిశ్రమగాఎల్జీడీలు ఎదిగిన తీరు ఎంత వేగవంతమైందో చూపిస్తోంది. పదేళ్లలో ల‌క్ష‌ క్యారెట్ల నుంచి 18.8 మిలియన్ క్యారెట్లకు చేరడం, ప్రపంచ వజ్ర మార్కెట్‌లో అరుదైన రికార్డుగా అంచ‌నా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.

విలువ పరంగా మాత్రం సహజ వజ్రాలు ఇంకా ముందంజలో ఉన్నాయి. పాలిష్ చేసిన ఎల్జీడీల సగటు ఎగుమతి ధర.. క్యారెట్‌కు సుమారు 60 డాలర్లు కాగా, సహజ వజ్రాల సగటు ధర క్యారెట్‌కు 760 డాలర్ల వరకు ఉందని సమాచారం. అంటే, ఎల్జీడీలు పరిమాణంలో ఎదిగినా, విలువలో ఇంకా సహజ వజ్రాల స్థాయికి చేరలేదు.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...