హరికృష్ణకి గాలం వేస్తున్న వైకాపా

 

వైకాపా తన బద్ధ శత్రువయిన తెదేపాను, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని చాలా కాలంగా వ్యూహాలు రచిస్తోంది. ఫ్లెక్సీ బ్యానర్స్ వ్యూహంతో హరికృష్ణ, అతని కుమారుడు జూ.యన్టీఆర్-చంద్రబాబు, బాలకృష్ణలకు మధ్య ఆ పార్టీ పెట్టిన చిచ్చుఅందుకు ఒక చక్కటి ఉదాహరణ. సమైక్యనినాదం అందుకొన్న వైకాపా, హరికృష్ణను కూడా మెల్లగా ఆ ముగ్గులోకి లాగి, చంద్రబాబుకి తెలియకుండా చాలా కధ నడిపినట్లు తెలుస్తోంది.

 

చంద్రబాబు, బాలక్రిష్ణలపై కోపంతో రగిలిపోతున్నహరికృష్ణను ఆయుధంగా చేసుకొని తేదేపాపై గురిపెట్టేందుకు వైకాపా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేవరకు చంద్రబాబుకి కూడా తెలియదు. రాజీనామా చేసిన తరువాత తను కూడా సమైక్యాంధ్ర కోరుతూ బస్సు యాత్ర చేపడతానని హరికృష్ణ ప్రకటించడం కూడా వైకాపా వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. తద్వారా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నహరికృష్ణను పార్టీ నుండి బహిష్కరించినట్లయితే ఆయనని వైకాపా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. అప్పుడు ఆయనతో బాటు ఆయన కుమారుడు జూ.యన్టీఆర్ కూడా వైకాపాకు బోనస్ గా దొరుకుతాడు. అంతే గాక, తెదేపా సమైక్యాంధ్రకు వ్యతిరేఖమనే భావన కూడా ప్రజలలో కలిగిన్చావచ్చును.

 

ఒకవేళ బహిష్కరించకపోయినట్లయితే, హరికృష్ణ చేస్తున్నసమైక్యవాదంతో తేదేపాకు తెలంగాణాలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. కానీ గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహంతో తనకు, తేదేపాకు మధ్య చిచ్చుపెట్టింది వైకాపాయేనని హరికృష్ణకు తెలిసినప్పటికీ, ఆయన ఆ పార్టీ ఉచ్చులోనే చిక్కుకోబోతున్నట్లు కనబడుతున్నారు.

 

చంద్రబాబు మీద ద్వేషంతో ఒకవేళ ఆయన వైకాపాలో జేరినట్లయితే ఆయన ఆ పార్టీలో ఎంతో కాలం ఇమడలేరు. ఎందుకంటే, ఆయనవంటి ఆవేశపరుడు జగన్ మోహన్ రెడ్డి వంటి దుందుడుకు స్వభావం గల వ్యక్తితో ఎంతో కాలం సర్దుకుపోలేరు. మరో ముఖ్యమయిన విషయం ఏమిటంటే వైకాపా ఆయనను చంద్రబాబు, తెదేపాలపై ఆయుధంగా వాడుకోవాలని, జూ.యన్టీఆర్ స్టార్ ఇమాజ్ ని వాడుకోవాలనే ఆలోచనతోనే పార్టీలోకి ఆహ్వానించవచ్చుతప్ప ఆయనేదో గొప్పవాడని, గొప్ప ప్రజాకర్షణగల నేతని కాదు.

 

ఒకవేళ హరికృష్ణ వైకాపాలో జేరినట్లయితే, ఆయన తన జీవిత కాలంలో జూ.యన్టీఆర్ ను ఉన్నత పదవిలో చూసే అవకాశం లేదు. ఎందుకంటే వైకాపాలో ఆ అవకాశం కేవలం జగన్ మోహన్ రెడ్డికే రిజర్వ్ చేయబడి ఉంది. ఈ విషయం గ్రహిస్తే హరికృష్ణ తెదేపా వీడే సాహసం ఎన్నడూ చేయరు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu