హార్దిక్ పాండ్యా ఔట్.. ముంబై ఇండియన్స్‌లోకి ఆ స్టార్ ఓపెనర్? ఐపీఎల్‌లో భారీ ట్రేడ్ డీల్!

posted on: Jun 23, 2026 11:26AM

ఐపీఎల్ క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా ఒక భారీ సంచలనానికి తెరలేవబోతోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. గత కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదిలించుకోవడానికి ముంబై యాజమాన్యం సిద్ధమైందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం మూడేళ్ల క్రితమే గుజరాత్ టైటాన్స్ జట్టు నుండి దాదాపుగా 100 కోట్ల రూపాయల భారీ మొత్తానికి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే, అంత భారీ పెట్టుబడి పెట్టినప్పటికీ హార్దిక్ కెప్టెన్సీలో ముంబై జట్టు పాత వైభవాన్ని అందుకోలేకపోగా, తీవ్రంగా విఫలమైంది. జట్టులో అంతర్గతంగా పెరిగిన వ్యతిరేకత, అలాగే మైదానంలో వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలోనే హార్దిక్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అప్పగించేందుకు ముంబై గట్టిగా పావులు కదుపుతోంది.

ఈ మెగా ట్రేడ్ డీల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ ఉచితంగా పాండ్యాను వదులుకోవడం లేదు. దానికి బదులుగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న ఒక స్టార్ ఆటగాడిని తమ వైపు తిప్పుకోవాలని పట్టుబడుతోంది. రేవ్‌స్పోర్ట్స్ కథనం ప్రకారం.. ముంబై ఇండియన్స్ కన్ను రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌పై పడింది. రంజీ ట్రోఫీల్లో ముంబై తరఫునే ఆడుతున్న స్థానిక ఆటగాడైన యశస్వీ జైస్వాల్‌ను ఎలాగైనా ముంబై ఇండియన్స్ జెర్సీలో చూడాలని యాజమాన్యం పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ముంబై జట్టులో మాజీ సారథి రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు చేరుకోవడం, మరోవైపు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మరియు మునపటి వేగం తగ్గడం వంటి అంశాలు ముంబైని కలవరపెడుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పవర్‌ప్లేలో జట్టుకు ధనాధన్ బ్యాటింగ్‌తో శుభారంభాలు ఇవ్వగల బలమైన ఓపెనర్ అవసరం ముంబైకి ఎంతైనా ఉంది. అందుకే యశస్వీ జైస్వాల్ సరైన ఛాయిస్ అని భావించి హార్దిక్-యశస్వీల మధ్య ఈ ప్లేయర్ స్వాప్ ట్రేడింగ్ చర్చలు జరుపుతున్నారు.

అయితే, ఈ డీల్ అనుకున్నంత సులభంగా ముగిసేలా కనిపించడం లేదు. రాజస్థాన్ రాయల్స్ ఈ ప్రతిపాదనకు ఇంకా పూర్తిగా పచ్చజెండా ఊపలేదు. ఎందుకంటే, ఆ జట్టుకు గతంలో కీలకమైన సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరిన తర్వాత, రాజస్థాన్‌ రాయల్స్ బ్యాటింగ్ లైనప్‌లో యశస్వీ జైస్వాల్ అత్యంత కీలకమైన స్టార్ ప్లేయర్‌గా అవతరించాడు. కాకపోతే, ప్రస్తుతం 15 ఏళ్ల వయసులోనే అద్భుత విధ్వంసక ఆట తీరుతో దూసుకొస్తున్న వైభవ్ సూర్యవంశీ రూపంలో యశస్వీకి గట్టి పోటీ ఎదురవుతోంది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కూడా పదిహేనేళ్ల ఈ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని మినహాయించి, మిగిలిన ఎవరినైనా ట్రేడ్ డీల్ ద్వారా మార్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితులలో యశస్వీ జైస్వాల్ కూడా తన ఫ్రాంచైజీని మార్చుకునే అంశంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నాడని సమాచారం. ఒకవేళ ఇరు జట్ల మధ్య చర్చలు సఫలమైతే, ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన, అతిపెద్ద ట్రేడింగ్ డీల్‌గా నిలిచిపోవడం ఖాయం. అతి త్వరలోనే ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య ఈ సంచలన డీల్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని ఐపీఎల్ వర్గాలు బలంగా చెప్తున్నాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...