విజయం కావాలంటే కష్టపడితే సరిపోదు.. వీటి మీద కూడా శ్రద్ద పెట్టాలి..!
posted on: Jan 29, 2026 1:52PM

విజయం ప్రతి మనిషి జీవితంలో ఒక కలలా ఉంటుంది. దాన్ని నిజం చేసుకునే వారు కొందరే ఉంటారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు.. ఏదో ఒక విషయంలో విజయం సాధించాలని శ్రమిస్తూ ఉంటారు. అయితే.. కొందరు లక్ష్యాన్ని సాధిస్తారు, మరికొందరు విఫలం అవుతారు. నేను చాలా కష్టపడ్డాను, కానీ విజయం సాధించలేకపోయాను అని కొందరు అంటూ ఉంటారు. అయితే విజయం సాధించాలంటే కేవలం కష్టపడితే సరిపోదు.. దానికి మరికొన్ని కూడా తోడవ్వాలి. చాలామంది కష్టపడి, దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ విజయం కోసం కష్టంతో పాటు మరికొన్ని చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుంటే.. ఈసారి విజయం అంతు చూడొచ్చు..
తప్పు..
విజయం సాధించడానికి కష్టపడటం మంచి లక్షణమే అయినా, కొందరు పైకి కష్టపడుతూ మరొకవైపు విజయం కోసం తప్పు చేస్తారు, అబద్దాలు చెప్తారు.
అబద్దాన్ని ఆశ్రయించి విజయం సాధించాలని అనుకోవడం చాలా తప్పు. అబద్దం వల్ల అప్పటికప్పుడు విజయం లభిస్తుందేమో కానీ.. దాని ప్రబావం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ సరైన దారిలోనే విజయం కోసం ప్రయత్నించాలి.
అహంకారం..
జీవితంలో ఏం సాధించినా, ఎంత తెలివైన వ్యక్తి అయినా ఎప్పుడూ గర్వపడకూడదు. అది ఒక వ్యక్తిని విజయవంతమైన వ్యక్తి అనే స్థాయి నుండి లాగి పడేస్తుంది. ఎంత తెలివైన వ్యక్తికి అయినా ఫెయిల్యూర్ రుచి చూపించేది అహంకారమే.. అందుకే ఎట్టి పరిస్థితులలో ఎంత తెలిసినా, ఎంత ఎదిగినా అహంకారం చూపించకూడదు.
సోమరితనం..
విజయానికి అతిపెద్ద శత్రువు సోమరితనం. సోమరితనం ఉన్న వ్యక్తి విజయం వైపు చురుగ్గా వెళ్లలేడు. ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా, ఎన్ని అవకాశాలు ఉన్నా.. అవి ఎక్కడికి పోవులే అనే నిర్లక్ష్యంతో ఉంటారు సోమరిపోతులు. అంతేకాదు.. సోమరిపోతులు ఏ పనిని మొదలు పెట్టినా దానిని సరిగా పూర్తీ చేయలేరు. ఫలితంగా ఎప్పటికీ ఫెయిల్యూర్ సర్కిల్ లోనే ఉండిపోతారు.
అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి, అన్నింటికంటే ముఖ్యంగా క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. క్రమశిక్షణ ఉన్నప్పుడు జీవితంలో అన్ని ఒక ప్రణాళికలో జరిగిపోతూ విజయానికి దగ్గర చేస్తాయి.
కోపం..
తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఎప్పుడో చెప్పారు. కోపంగా ఉన్నవారు.. వారు చేసే ప్రయత్నాలలో విఫలం అవుతూ ఉంటారు. వారి కోపమే వారిని దెబ్బతీస్తూ ఉంటుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు కూడా ఇలానే ఉంటాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మనిషి జీవితంలో తన సామర్థ్యాన్ని సరైన విధంగా వినియోగించుకోగలడు.
అందుకే కోపాన్ని దూరంగా ఉంచాలి, కోపం వచ్చినప్పుడు నా శత్రువు దగ్గరకు వచ్చింది దానికి దూరంగా ఉండాలి అనుకోవాలి. ఇది మనిషిని ప్రశాంత జీవనం వైపు నడిపిస్తుంది.
దైవం..
ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా ప్రశాంతత లభించేది దైవ ఆరాధన వల్లే.. జీవితంలో విజయం సాధించాలంటే సరస్వతి దేవి కృప, వినాయకుడి అనుగ్రహం ఉండాలి. వీరిద్దరి అనుగ్రహం ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితి అయినా తెలివిగా అధిగమించగలరు.
ప్రతిరోజూ సరస్వతి, గణేషుడి ఆరాధన, కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం వల్ల కోపాన్ని అధిగమించవచ్చు.
*రూపశ్రీ.




.webp)
.webp)


