Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వరల్డ్ హెల్త్ డే..ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..అందిరి చేతుల్లోనూ ఉంది!
posted on: Apr 7, 2026 1:17PM
.webp)
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు చాలా వరకు ఆరోగ్యం కోసమే ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ చూసినా హాస్పిటల్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా చాలా రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సపం ఎలా ఆవిర్బవించింది? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఈ రోజు ఏ కార్యక్రమాలు చేపడతారు? ఆరోగ్యం కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తెలుసుకుంటే..
వరల్డ్ హెల్త్ డే ప్రారంభం..
వరల్డ్ హెల్త్ డే ప్రారంభానికి ప్రధాన కారణం World Health Organization (WHO). 1948 ఏప్రిల్ 7న WHO అధికారికంగా స్థాపించబడింది. అదే తేదీని గుర్తుగా 1950 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ డే జరుపుతున్నారు. ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఈ రోజును ఏర్పాటు చేశారు.
ఉద్దేశ్యం..
ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరుపుకోవడం వెనుక కొన్ని ముఖ్య ఉద్దేశ్యాలు ఉన్నాయి.
ప్రజల్లో అవగాహన పెంచడం..
ఆరోగ్యం గురించి చాలామందికి సరైన సమాచారం, అవగాహన ఉండవు. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
గ్లోబల్ హెల్త్ సమస్యలపై దృష్టి..
ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఈ థీమ్ ను అనుసరించి కార్యక్రమాల రూపకల్పన, వాటి ఆచరణ వైపు ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు.. మెంటల్ హెల్త్, క్లైమేట్ చేంజ్ ప్రభావం, యూనివర్సల్ హెల్త్ కేర్ వంటి అంశాలు ఉండవచ్చు. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు, ప్రాణాళికలు.. ప్రపంచ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది.
ప్రభుత్వాలు, సంస్థలను ప్రోత్సహించడం..
దేశాలు తమ ఆరోగ్య విధానాలను మెరుగుపరచడానికి ఈ రోజు ప్రేరణ కల్పిస్తుంది. ఇందుకోసం.. ఆరోగ్య సమాచారం, ఆరోగ్యం కోసం మెరుగు పరుచుకోవలసిన అంశాలు, పర్యావరణం, ఆరోగ్య సూత్రాలు.. వంటివి సూచించడం జరుగుతుంది.
నిర్వహించే కార్యక్రమాలు..
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. ఇవి ప్రతి గ్రామం, ప్రతి ఊరు, పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వం, స్వచ్చంద ఆరోగ్య సంస్థల నేతృత్వంలో జరుగుతాయి.
ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామాలు, పట్టణాల్లో ఫ్రీ మెడికల్ చెకప్‌లు, రక్తపరీక్షలు, షుగర్, BP పరీక్షలు వంటివి ఉచితంగా చేస్తారు.
హెల్త్ ర్యాలీలు & అవగాహన కార్యక్రమాలు చేపడతారు. కొన్ని ప్రాంతాలలో వాకథాన్‌లు, మారథాన్‌లు, స్కూల్స్, కాలేజీల్లో అవగాహన సెషన్స్ నిర్వహిస్తారు.
చాలా చోట్ల సెమినార్లు & వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. డాక్టర్లు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రసంగాలు, మానసిక ఆరోగ్యం, పోషణపై చర్చలు వంటివి జరుపుతారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా ఇస్తారు. పిల్లలకు, పెద్దలకు టీకాలు వేయించడం, ప్రజల్లో ఇమ్యూనిటీ పెంపుకు తోడ్పడటం చేస్తారు.
సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తారు. హ్యాష్‌ట్యాగ్స్ ద్వారా అవగాహన, ఆరోగ్య చిట్కాలు పంచుకోవడం. ఆరోగ్య సమస్యల గురించి సరైన సమాచారం అందించడం, ఆరోగ్య విషయంలో చాలా చేసే నిర్లక్ష్యాల గురించి వివరించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్బాలు చెప్పడం వంటివి చేస్తారు.
అందరూ చేయాల్సింది..
హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు.. ఆరోగ్యం బాగుంటే కోట్ల ఆస్తులు ఉన్నట్టే.. అందుకే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబరచాలి. జాగ్రత్తలు తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ కు హాజరు కావాలి.
వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం వంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని చాలా గొప్పగా మెరుగుపరుస్తాయి. ప్రతి రోజు వీటిని కొద్దిసేపు అయినా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అనే అపోహను వదిలేయాలి. నోటికి రుచిగా ఉన్నది కాదు.. శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదో అది తినడం అలవాటు చేసుకుంటే.. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే భద్రంగా ఉంటుంది.
*రూపశ్రీ.






