కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారు..రజతోత్సవ సభపై రేవంత్ రియాక్షన్
posted on Apr 28, 2025 2:56PM

హన్మకోండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఇప్పుడు మాపై నిందలు వేేేస్తున్నరని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, తనకు మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాహుల్ గాంధీతో తనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్,కేకే, వేం నరేందర్ రెడ్డితో కలిసి నిన్న శాంతి కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు, అపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణపై చర్చించారు.
అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్ హయంలో ఖమ్మం రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అవసరాలకు అనుగణంగా కేసీఆర్, ప్రధానీ మోడీ మాటలు మారుస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని, రెండు దేశాలను ఓడించిన ఘనత ఇందిరాగాంధీదేనన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శాసన సభ్యులు హైదరాబాద్ లో టైమ్ పాస్ చేయడం సరికాదని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీలో ఓపిక ఉంటే పదవులు వస్తాయి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారు. రాహుల్ గాంధీకి, నాకు గ్యాప్ ఉందనడం అవాస్తవం అని మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఎవర్నీ నమ్మించాల్సిన పని లేదన్నారు. బయట ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోనని చెప్పారు.