Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...షాబాద్ ఆరుగురి హత్యల కేసులో సంచలనం..!
posted on: Jul 17, 2026 2:48PM

తెలంగాణ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ వరుస హత్యల కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకే రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో దారుణంగా ఆరుగురిని పొట్టనబెట్టుకున్న ప్రధాన నిందితుడు బి. రాజ్‌కుమార్ విషాదాంతం ముగిసింది. పోలీసుల నుంచి తప్పించుకుని పరారీలో ఉన్న రాజ్‌కుమార్, చివరకు కొత్తూరు మండలం పంజార్ల గ్రామం సమీపంలోని ఒక వెంచర్‌లో మృతదేహంగా లభ్యమయ్యాడు. అరెస్ట్ భయంతో అతడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఈ కేసులో తీవ్ర ఉత్కంఠకు తెరపడినట్లయింది. రాజ్‌కుమార్ మృతిపై పోలీసులు కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ ఘోర కలియుగ ఉన్మాదానికి వెనుక ఉన్న కారణాలను రాజ్‌కుమార్ సోదరుడు భాస్కర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలుగా వెల్లడించారు. రాజ్‌కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు తీవ్రంగా బానిసయ్యాడని, తద్వారా భారీగా అప్పులపాలై మానసిక ఒత్తిడికి గురయ్యాడని పేర్కొన్నారు. అప్పుల బాధ తట్టుకోలేక గతంలో అక్టోబర్ 2025లోనే అతడు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని గుర్తుచేశారు. ఆ తర్వాత అతడిపై నమోదైన పోక్సో (POCSO) కేసుతో రాజ్‌కుమార్ మానసిక ప్రవర్తన పూర్తిగా మారిపోయి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని, ఇది చివరకు ఈ దారుణ మారనకాండకు దారితీసిందని వివరించారు.
షాబాద్ పరిధిలో జరిగిన ఈ ఘోర హత్యల వివరాలు గుండెలు పిండేసేలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబ సభ్యులు రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్‌కుమార్, ఆ కక్షతో రగిలిపోయాడు. ఒకే రాత్రి వేర్వేరు చోట్ల కత్తితో దాడి చేసి ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. మొదట తనపై కేసు పెట్టిన బాలిక నివాసానికి వెళ్లి, ఆమె తల్లిని, నానమ్మను హతమార్చాడు. అనంతరం ఆ బాలికను కత్తితో బెదిరించి ఊరి వెలుపలికి తీసుకెళ్లి గొంతుకోసి చంపేశాడు. అక్కడితో ఆ ఉన్మాది ప్రతీకారం చల్లారలేదు. వెంటనే తన స్వగ్రామానికి వెళ్లి, ఇంట్లో నిద్రిస్తున్న తన భార్య సరిత, 4 సంవత్సరాల కుమారుడు, కేవలం 18 నెలల పసికందు అయిన చిన్న కుమారుడి గొంతుకోసి అత్యంత అమానుషంగా మట్టుబెట్టాడు.
ఈ దారుణ హత్యలు చేయడానికి కొన్ని గంటల ముందే రాజ్‌కుమార్ తన ఫోన్‌లో ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో, పోక్సో కేసు వల్ల తన జీవితం, పరువు నాశనమయ్యాయని, ఆ కుటుంబం వల్లే భారీగా అప్పులు చేయాల్సి వచ్చిందని వాపోయాడు. అందుకే వారిని, ఆ తర్వాత తన భార్యాపిల్లలను చంపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఈ ఘాతుకాల తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి, "నేను ఆరుగురిని చంపేశాను, మీరు కూడా ఇల్లు వదిలి వెళ్లిపోండి" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. పరారీలో ఉన్న రాజ్‌కుమార్ ఆచూకీ కోసం ఫ్యూచర్ సిటీ పోలీసులు 7 నుంచి 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
నిందితుడి సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అయితే పోలీసులకు దొరికిపోతాననే భయంతో రాజ్‌కుమార్ మరోసారి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ మరణంతో రెండు కుటుంబాల్లోని ఆరుగురు అమాయకులు బలికాగా, ఉన్మాది కథ కూడా విషాదంగా ముగిసింది.
తన తమ్ముడు మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, స్వచ్ఛందంగా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 238/2026గా బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును ఎస్‌ఐ ఎం. గోపాలకృష్ణకు అప్పగించారు. ఈ విషయాన్ని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్, షాద్‌నగర్ జోన్ డీసీపీ, షాద్‌నగర్ ఏసీపీకి నివేదించారు.
Shabad mass murder case, Rajkumar suicide, Shabad psycho killer, Rangareddy crime updates, online betting debt suicide, BNS Section 194 case, CM Revanth reddy, DGP C.V. Anand, CP Sajjanar






