విశాఖ మేయర్‌‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ..గుంటూరు, కుప్పం టీడీపీ కైవసం

 

విశాఖ మహానగర పాలక మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవం ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు.  మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. దీంతో మేయర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కోరం సరిపోవడంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి.. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్‌గా కూటమి అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్‌ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటించి.. ఆయనకు ధ్రువపత్రం అందజేశారు. 2021 గ్రేటర్ విశాఖ నగర పాలక ఎన్నికల్లో టీడీపీ  అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును అధిష్ఠానం ప్రకటించింది. అప్పట్లో మెజార్టీ లేకపోవడంతో ‘పీలా’కు పదవి దక్కలేదు. నాలుగేళ్ల పాటు పార్టీ బలోపేతానికి చేసిన కృషితో పాటు, వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడిన పీలా శ్రీనివాసరావుకు పార్టీ అధిష్ఠానం మరోసారి అవకాశం కల్పించింది.


మరోవైపు చిత్తూరు  కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా కైవసం చేసుకుంది. ఎన్నిక ప్రక్రియ చివరి నిమిషంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో, వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలకడం ఈ విజయానికి కారణమైంది. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కుప్పంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఓటింగ్ ప్రక్రియకు ముందు వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ శిబిరానికి చేరుకోవడం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. దీంతో టీడీపీ బలం ఒక్కసారిగా పెరిగింది. మొత్తం 14 మంది టీడీపీ కౌన్సిలర్ల మద్దతుకు, ఎమ్మెల్సీ ఓటు కూడా తోడవడంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా 15 ఓట్లు నమోదయ్యాయి. 5వ వార్డు కౌన్సిలర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న వన్నియకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజును కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు అధికారులు ప్రకటించారు. వైసీపీ నుంచి కేవలం 8 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు.


గుంటూరు నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా కూటమి అభ్యర్థి, టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర (నాని) ఎన్నికయ్యారు. గత మేయర్, వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు కొత్త మేయర్ ఎన్నికను అధికారులు నిర్వహించారు. ఈ ఎన్నికలో కూటమి తరఫున కోవెలమూడి రవీంద్ర విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు.నిన్నటి వరకు ఈ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని అందరూ భావించారు. అయితే, ఈ ఉదయం అనూహ్యంగా వైసీపీ తరఫున 30వ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ నెలకొంది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. కూటమి తరఫున కోవెలమూడి రవీంద్ర, వైసీపీ పక్షాన అచ్చాల వెంకటరెడ్డి మేయర్ పదవికి పోటీ పడ్డారు.వాస్తవానికి గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లతో సంపూర్ణ ఆధిక్యం ఉండేది.టీడీనపీకి 9, జనసేనకు ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. సుమారు 19 మంది వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామంతో కార్పొరేషన్‌లో వైసీపీ బలం తగ్గగా, మేయర్‌‌ను టీడీపీ కైవసం చేసుకుంది.