రూ. 40 లక్షల జీతం.. BMW కారు.. అయినా రాత్రి నిద్ర లేదు.. ఎందుకు?

posted on: Jun 6, 2026 10:05AM

ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉంటే మనిషి ప్రశాంతంగా నిద్రపోగలడు? ఏడు అంకెల భారీ జీతం, చేతి నిండా డబ్బు, తిరగడానికి లగ్జరీ కారు, ఉండటానికి సొంత ఇల్లు ఉంటే జీవితంలో సెటిల్ అయిపోయినట్లేనా? సమాజం దృష్టిలో అన్ని సౌకర్యాలతో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా నేడు తీవ్రమైన మానసిక అశాంతితో, తాము వెనుకబడిపోతున్నామేమో అన్న ఆందోళనతో బతుకుతున్నారు. సరిగ్గా ఇదే అంశంపై ఎవర్హోప్ ఆంకాలజీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ సన్నీ గార్గ్ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక కథనం ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. విజయం, ఇతరులతో పోలిక, నిరంతరం పరుగు పెట్టాలనే తపన మనిషిని ఎలా మానసిక రోగిగా మార్చేస్తుందో ఈ ఉదంతం అద్దం పడుతోంది.

డాక్టర్ గార్గ్ ఇటీవల గురుగ్రామ్‌కు చెందిన ఒక 34 ఏళ్ల ఐటీ వృత్తి నిపుణుడిని కలిశారు. పైకి చూస్తే అతను ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక మంచి 2BHK అపార్ట్‌మెంట్‌లో నివాసం, తిరగడానికి బ్రాండెడ్ బీఎమ్‌డబ్ల్యూ కారు, సంవత్సరానికి సుమారు రూ. 40 లక్షల భారీ సంపాదన ఉంది. ఏ సగటు భారతీయుడికైనా ఇది ఒక కలల జీవితం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆ యువకుడు డాక్టర్ ముందు కూర్చుని తీవ్రమైన మానసిక వేదనను పంచుకున్నాడు. తన ఆరోగ్యం చాలా క్షీణించిందని, రాత్రిపూట అస్సలు నిద్ర పట్టడం లేదని, ఇంత సంపాదిస్తున్నా నన్ను నేను చాలా పేదవాడిగా భావిస్తున్నానని బోరుమన్నాడు. మొదట వినడానికి ఇది వింతగా అనిపించినా, డాక్టర్ గార్గ్ మాత్రం కొట్టిపారేయలేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక్క వ్యక్తి సమస్య కాదు.. నేటి ఆధునిక భారతీయ మెట్రో నగరాల్లో వృత్తి నిపుణులందరూ అనుభవిస్తున్న నిశ్శబ్ద నరకం.

గణాంకాల ప్రకారం చూస్తే సంవత్సరానికి రూ. 40 లక్షలు సంపాదించే వ్యక్తి భారతదేశంలో అత్యధిక ఆదాయం కలిగిన మొదటి 1% అత్యున్నత జనాభాలో ఉంటాడు. అయినా అతను తనను తాను పేదవాడిగా ఎందుకు భావిస్తున్నాడు అంటే దానికి కారణం అతని బ్యాంకు ఖాతా కాదు, అతను విజయాన్ని కొలిచే  పోలిక స్థానం  పూర్తిగా మారిపోవడమే. పూర్వం రోజుల్లో మనుషులు తమ చుట్టుపక్కల వారితోనో, లేదా తమ పరిచయస్తులతోనో తమను పోల్చుకునేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ యువకుడు లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి, అక్కడ ఒక స్టార్టప్‌ను అమ్మి రూ. 80 కోట్ల భారీ సంపదతో మెరిసిపోతున్న 28 ఏళ్ల యువకుడితో తనను తాను పోల్చుకుంటున్నాడు. దీనినే డాక్టర్ గార్గ్  ఆధునిక పేదరికం  అని పిలిచారు. ఇక్కడ ఆదాయం పెరుగుతోంది, కానీ దానికంటే పది రెట్లు వేగంగా అంచనాలు, ఆశలు పెరిగిపోతున్నాయి. ఈ రెండింటి మధ్య ఉండే అంతరమే మనిషిని నిద్రపోనివ్వడం లేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...