డేరాల హింస..ఖట్టర్‌ మెడపై కత్తి..?

అత్యాచారం, హత్య కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్‌ను సీబీఐ న్యాయస్థానం దోషిగా తేల్చడాన్ని ఆయన భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. డేరా బాబాని అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో గుర్మీత్ అనుచరులు, భక్తులు పలు విధ్వంసాలకు తెగబడ్డారు..ముఖ్యంగా హర్యానా తగలబడిపోతోంది. ద్విచక్రవాహనాలు, బస్సులు ఆఖరికి రైళ్లు కూడా ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలకు ఆహుతైపోతున్నాయి. ఈ పరిణామాలన్ని ముందే ఊహించినప్పటికీ..రాష్ట్ర పోలీసులకు తోడు ఏకంగా ఆర్మీని రంగంలోకి దించినప్పటికీ అవేవి మూలకు కూడా సరిపోవడం లేదు.

 

మరోవైపు ఈ అల్లర్లు హర్యానాని దాటి పంజాబ్, రాజస్థాన్‌, ఢిల్లీకు పాకాయి. చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినా..కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినా పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఇక ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మెడకు చుట్టుకుంది. గుర్మీత్‌ తీర్పు నేపథ్యంలో ఇటువంటి అల్లర్లు జరుగుతాయని ముందే తెలిసినప్పటికీ వాటిని అదుపు చేయలేకపోవడంతో ఖట్టర్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి తోడు హర్యానా హైకోర్టు కూడా మనో‌హర్‌లాల్‌కు చీవాట్లు పెట్టింది. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పంచకుల తగలబడుతున్నా సీఎం చూస్తూ వుండిపోయారని మందలించింది.

 

కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించడంతో పాటు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఖట్టర్‌పై వేటు పడే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ బీజేపీ అధిష్టానం మనోహర్‌ను వెనకేసుకొచ్చింది. డేరా స్వచ్ఛ సౌధాకు ఉన్న మద్దతుతో పోలిస్తే జరిగిన హింస చాలా తక్కువేనని..ముఖ్యమంత్రి చాకచక్యం కారణంగానే పెద్ద విధ్వంసం తప్పిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా అన్నట్లు సమాచారం. ఏది ఏమైనా మరో రెండు రోజులు గడిస్తే కానీ ఖట్టర్‌కు పదవీ గండం ఉందో లేదో తెలియదు. ప్రస్తుతానికి మనోహర్‌ సేఫే అని చెప్పవచ్చు.