పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలు

posted on: Jul 22, 2026 2:50PM

పశ్చిమాసియాలో ఇటీవల సంభవించిన సైనిక, రాజకీయ పరిణామాలు గల్ఫ్ దేశాల భద్రతా విధానాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాయి. సాంప్రదాయకంగా అత్యంత ఖరీదైన పాశ్చాత్య ఆయుధ సంపత్తిపై ఆధారపడిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ వంటి దేశాలు ప్రస్తుతం తమ రక్షణ వ్యూహాలను పునఃపరిశీలించుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. ఇరాన్ ప్రయోగించిన తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, బాలిస్టిక్,  క్రూయిజ్ క్షిపణుల విసిరిన సవాళ్లు ఈ దేశాల రక్షణ వ్యవస్థల్లోని లోపాలను బట్టబయలు చేశాయి. ఈ క్రమంలో, తక్కువ వ్యయంలో అత్యుత్తమ సాంకేతికతను అందించగల దేశంగా భారతదేశం ముందుకు వచ్చేందుకు అపార అవకాశాలు లభిస్తున్నాయి.  ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే.. యుద్ధాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. కేవలం అధునాతన యుద్ధ విమానాల వల్ల మాత్రమే విజయం సాధ్యం కాదని, బహుళ అంచెల వైమానిక రక్షణ వ్యవస్థలు, కౌంటర్ డ్రోన్ గ్రిడ్‌లు,  ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నెట్ వర్క్ లు  కీలకమని స్పష్టమవుతోంది. గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన ఈ రక్షణ శూన్యతను పూరించడంలో భారత  రక్షణ పరిశ్రమ కీలక పాత్ర పోషించగలదా అనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత తీవ్ర చర్చ జరుగుతోంది.  

వ్యయ అసమానత,  రక్షణ రంగ సవాళ్లు

గల్ఫ్ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు.. ఆయుధాల వ్యయ అసమానత. ఉదాహరణకు, శత్రువులు ఉపయోగించే ఒక సాధారణ డ్రోన్ తయారీ వ్యయం 20 నుంచి  50 వేల డాలర్లు మాత్రమే ఉంటుంది. అయితే, దానిని గగనతలంలోనే అడ్డుకుని కూల్చివేయడానికి ఉపయోగించే అధునాతన ఇంటర్ సెప్టర్ క్షిపణుల ధర 30 నుండి 50 లక్షల డాలర్ల వరకు ఉంటోంది. ఈ వ్యయ వ్యత్యాసం సుదీర్ఘకాలం పాటు కొనసాగించడం ఆర్థికంగా భారం కానుంది.  చారిత్రకంగా గల్ఫ్ దేశాలు తమ రక్షణ అవసరాల కోసం ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలపై ఆధారపడ్డాయి. అయితే, ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న వరుస దాడులు, క్షిపణి నిల్వలు వేగంగా తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఒకే మూలంపై ఆధారపడటం ప్రమాదకరమని ఆ దేశాలు గ్రహించాయి. దీనితో తమ రక్షణ భాగస్వాములను వైవిధ్యపరచుకోవాలనే ఆలోచన వైపు గల్ఫ్ అధినేతలు అడుగులు వేస్తున్నారు.  

దిగుమతిదారు నుండి ఎగుమతిదారుగా భారత రక్షణ రంగ ప్రస్థానంది

భారతదేశ రక్షణ రంగ ప్రయాణంలో గడిచిన పదేళ్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటిగా ఉన్న భారత్, ఇప్పుడు  స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది.  మేక్ ఇన్ ఇండియా,  ఆత్మనిర్భర్ భారత్ వంటి విధానాలు, అలాగే  పాజిటివ్ ఇండిజనైజేషన్ జాబితాల ద్వారా దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది.  గణాంకాలను పరిశీలిస్తే..  2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం కొన్ని వందల కోట్లకు పరిమితమైన భారత రక్షణ ఎగుమతులు, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఏటా కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రక్షణ బడ్జెట్ కేటాయింపుల్లో స్వదేశీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం వల్ల అంతర్జాతీయ ఆయుధ విపణిలో ఇండియా విశ్వసనీయత పెరిగింది.   2013-14 లో ఇండియా రక్షణ ఎగుమతులు 686  కోట్లు ఉండగా అది 2023-24 నాటికి 21వేల83కోట్లకు పెరిగింది. ఇక   2024-25 నాటికి ఈ ఎగుమతుల విలువ 23 వేల 622కోట్లకూ,   2025-26 నాటికి 38 వేల 424  కోట్ల రూపాయలకు పెరిగింది. 

అంతర్జాతీయ విపణిలో భారత వ్యవస్థల ముద్ర 

గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్‌లో భారత  రక్షణ పరికరాల సమర్థత ఇప్పటికే రుజువైంది. ఆసియా, ఆఫ్రికా,  తూర్పు ఐరోపాలోని పలు దేశాలు భారత ఆయుధ వ్యవస్థలపై ఆసక్తి చూపడమే కాకుండా భారీ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఫిలిప్పీన్స్, ఆర్మేనియా వంటి దేశాలకు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు,  పినాకా మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ల విక్రయం భారత రక్షణ రంగ చరిత్రలో కీలక ఘట్టాలుగా నిలిచాయి.   తీవ్రమైన పరిస్థితుల్లో, ప్రత్యక్ష యుద్ధ రంగంలో తమ ప్రతిభను ప్రదర్శించిన వ్యవస్థలకే అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉంటుంది. సరిహద్దుల్లో చోటుచేసుకున్న పలు రక్షణ చర్యలలో భారత్ దేశీయంగా తయారు చేసిన ఆకాశ్, ఆకాశ్ తీర్, బ్రహ్మోస్,   నేత్రా వ్యవస్థలను విజయవంతంగా ఉపయోగించడం వల్ల అంతర్జాతీయ కొనుగోలుదారులలో ఇండియాపై నమ్మకం రెట్టింపైంది. ఈ అనుభవం గల్ఫ్ దేశాల దృష్టిని ఇండియావైపు మళ్లేలా చేసింది. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఆధారంగా పనిచేసే ఆకాశ్ తీర్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ,  సమర్థవంతమైన ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు శత్రు డ్రోన్లు, క్షిపణులను ఏకకాలంలో ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.  

గల్ఫ్ ప్రాంతంలో వ్యూహాత్మక అవకాశాలు

ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలు తమ వైమానిక రక్షణ కోసం ఉపయోగించే క్షిపణి నిల్వలు గణనీయంగా తగ్గినట్లు అనేక అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిరంతర దాడులను తట్టుకోవడానికి, తమ కీలక మౌలిక సదుపాయాలైన చమురు శుద్ధి కర్మాగారాలు, నీటి శుద్ధి ప్లాంట్లు, విమానాశ్రయాలను కాపాడుకోవడానికి ఆ దేశాలకు అత్యంత వేగంగా, సమర్థవంతంగా పనిచేసే అదనపు రక్షణ వ్యవస్థలు అవసరం.  భారత్ తయారుచేసే ఆయుధ వ్యవస్థలు పాశ్చాత్య దేశాల ఉత్పత్తులతో పోలిస్తే   తక్కువ వ్యయంతో లభిస్తాయి. అంతేకాకుండా, అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూనే, బహుళ లక్ష్యాలను ఒకేసారి ఛేదించే పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. దీనికి తోడు, ఇండియా అంతర్జాతీయ రక్షణ నియంత్రణ సంస్థలైన ఎమ్టీసీఆర్,  వాసెనార్ ఒప్పందాలలో సభ్యత్వం కలిగి ఉండటం వల్ల చట్టబద్ధమైన ఆయుధ ఎగుమతులకు మార్గం సుగమమైంది.  దౌత్యపరమైన బంధం,  పారిశ్రామిక వృద్ధి

ఒకప్పుడు ఇండియా, గల్ఫ్ సంబంధాలు కేవలం చమురు దిగుమతులు,  వలస కార్మికుల సంక్షేమానికే పరిమితమై ఉండేవి. అయితే, మారుతున్న కాలంతో పాటు ఈ సంబంధాలు వ్యూహాత్మక రక్షణ,  సాంకేతిక భాగస్వామ్యంగా పరిణామం చెందుతున్నాయి. భారత రక్షణ రంగానికి గల్ఫ్ దేశాలు కొనుగోలుదారులుగా మారితే, అది ఉభయ దేశాల దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.  ఈ అభివృద్ధి దేశీయంగా అనేక ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది.

ఇండియాలో రక్షణ భాగాల తయారీలో వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నిరంతర ఆర్డర్లు లభిస్తాయి. అలాగే ఐడెక్స్  వంటి పథకాల ద్వారా వందలాది స్టార్టప్‌లు రక్షణ సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.   రక్షణ తయారీ రంగ విస్తరణతో ఉత్పాదక సెక్టార్‌లో నైపుణ్యం కలిగిన యువతకు విస్తృతమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.  

గల్ఫ్ రక్షణ విపణిలోకి ప్రవేశించడం భారత్‌కు గొప్ప అవకాశమే అయినప్పటికీ, అక్కడ కొన్ని సవాళ్లు కూడా   ఉన్నాయి. గల్ఫ్ దేశాలు ప్రస్తుతం వాడుతున్న పాశ్చాత్య వ్యవస్థలతో భారతీయ ఆయుధాలు కలిసి పనిచేసేలా  సాంకేతిక మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే..  అత్యవసర పరిస్థితుల్లో విడిభాగాల సరఫరా, సాంకేతిక నిర్వహణ,  సిబ్బందికి నిరంతర శిక్షణ అందించగల సామర్థ్యాన్ని భారత్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.  అంతే కాకుండా, అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంజిన్లు, కొన్ని రకాల జలాంతర్గాముల సాంకేతికతల కోసం భారత్ ఇప్పటికీ ఇతర దేశాలపై ఆధారపడుతోంది. అందువల్ల, ఎగుమతుల పరిమాణాన్ని మరింత పెంచాలంటే స్వదేశీ పరిశోధన, అభివృద్ధి ( ) విభాగానికి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.  

సమగ్రంగా పరిశీలిస్తే, పశ్చిమాసియాలో చోటుచేసుకున్న భద్రతా సంక్షోభం గల్ఫ్ దేశాల రక్షణ వ్యూహాలలో స్పష్టమైన మార్పు తెచ్చింది. అయితే, భారత్ వెంటనే ఆ మార్కెట్‌ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకుంటుందని భావించడం సరైంది కాదు. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల స్థానాన్ని భర్తీ చేయడం కంటే, ఆ వ్యవస్థలకు అదనపు బలంగా నిలబడటంలోనే భారత విజయం ఆధారపడి ఉంటుంది.  సమర్థవంతమైన దౌత్యం, సకాలంలో ఆయుధాలను అందించే ఉత్పాదక వేగం,  దీర్ఘకాలిక నిర్వహణ హామీలను అందించగలిగితే, గల్ఫ్ ప్రాంతంలో  మేడ్ ఇన్ ఇండియా  రక్షణ ఉత్పత్తులు తమ ఆధిపత్యాన్ని చెలాయించడం ఖాయం. ఇది భారత ఆర్థిక వ్యవస్థకే కాకుండా, ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతున్న ప్రస్థానానికి ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. 

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.   

Gulf security, Iranian missile attacks, Indian defense exports, Akash missile system, BrahMos exports

google-ad-img
    Related Sigment News
    • Loading...