Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇడియన్ ఇమ్మిగ్రెంట్స్ పై టెక్సాస్ లో పెరుగుతున్న అపోహలు!
posted on: May 18, 2026 5:29PM

టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగర మున్సిపల్ కౌన్సిల్ వేదికగా ఇటీవల జరిగిన ఒక సమావేశం అంతర్జాతీయంగా సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన భారతీయ సమాజంపై.. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో సేవలందిస్తున్న హెచ్-1బీ వీసాదారులపై వస్తున్న వివిధ రకాల ఆరోపణలను తిప్పికొడుతూ ఒక ఇడియన్ అమెరికన్ మహిళ ఫ్రిస్కో నగర మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా చేసిన ప్రసంగం సోషల్ మీడియా వేదికలపై అత్యంత విస్తృతమైన చర్చకు దారితీసింది స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు తక్కువ వేతనాలకే చేస్తూ లాగేసుకుంటున్నారనే ప్రచారాన్ని, స్థానిక భూములను ఆక్రమిస్తున్నారనే ఆరోపణలను, అపోహలను ఆమె కేవలం మాటలతో కాకుండా అధికారిక డేటా, చారిత్రక పరిణామాలు, అమెరికా అసలు సామాజిక స్వరూపం అనే మూడు ముఖ్యమైన కోణాల్లో గట్టి సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. ఫ్రిస్కోలో మారుతున్న జనాభా గణాంకాలు, స్థానిక శ్వేతజాతీయుల ఆందోళనలు, అసలైన అమెరికన్ ఎవరు? అంటూ జరుగుతున్న చర్చపై ప్రత్యేక విశ్లేషణ
అమెరికా మొత్తం జనాభాను పరిశీలిస్తే ఇండియన్ అమెరికన్ల వాటా కేవలం 1.5% 1.7 శాతం మాత్రమే. అయినప్పటికీ.. ఈ చిన్న వర్గం దేశ ఆర్థిక, విద్యా రంగాల్లో చూపిస్తున్న ప్రభావం అసాధారణమైనది. భారతీయ డయాస్పోరాలో బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నత చదువులు చదివిన వారి శాతం 75 నుంచి 80 వరకు ఉంది. ఇది అమెరికా జాతీయ సగటు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. అలాగే.. వీరి మధ్యస్థ కుటుంబ ఆదాయం 150,000 డాలర్ల మార్కును తాకుతూ.. అమెరికాలోనే అత్యధిక ఆదాయం కలిగిన అగ్రశ్రేణి వర్గాలలో ఒకటిగా నిలుస్తోంది. జాతీయ సగటుతో పోలిస్తే భారతీయులలో నేరాల రేటు, జైలు శిక్షలు పడే అవకాశాలు, ప్రభుత్వ ఉచిత పథకాలపై ఆధారపడటం చాలా తక్కువగా ఉంది. ఈ గణాంకాలన్నీ భారతీయులు అమెరికాకు ఎన్నటికీ భారం కాదనీ, వారు దేశానికి ఒక విలువైన ఆస్తి అని నిరూపిస్తున్నాయి.
గడిచిన పది పదిహేనేళ్ల కాలంలో ఫ్రిస్కో నగరంలో ఆసియా, మరీ ముఖ్యంగా ఇండియన్ల జనాభా విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉన్న ఈ సబర్బన్ ప్రాంతంలో.. నేడు ఆసియన్ల వాటా దాదాపు మూడో వంతుకు చేరుకుంది. ఈ ఆకస్మిక మార్పు స్థానిక నివాసితులలో ఒక రకమైన అభద్రతా భావాన్ని, సాంస్కృతిక అసౌకర్యాన్ని కలిగిస్తోంది. అయితే, ఈ జనాభా పెరుగుదల నగర అభివృద్ధికి ఎలా తోడ్పడిందన్నది అధికారిక డేటా స్పష్టం చేస్తోంది. 2025 నాటి గణాంకాల ప్రకారం, అమెరికాలోని అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో ఫ్రిస్కో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ నేరాల రేటు తక్కువగా ఉండటంతో పాటు పాఠశాలల ప్రమాణాలు మెరుగవ్వడం, రియల్ ఎస్టేట్ విలువలు పెరగడం వెనుక విద్యావంతులైన ఇండియన్స్ పాత్ర ఎంతో ఉందనేది వాస్తవం. మరోవైపు హెచ్-1బీ వీసా విధానంపై స్థానికుల్లో ఉన్న అపోహలను కూడా ఈ సందర్భంగా సదరు మహిళా ప్రతినిధి పటాపంచలు చేశారు. హెచ్-1బీ అనేది ఏదో సులువుగా వచ్చే చౌక కార్మిక వీసా కాదనీ.. అది కఠినమైన నిబంధనలు, ఉన్నత విద్యా అర్హతలు కలిగిన నిపుణులకు మాత్రమే లభించే నైపుణ్య ఆధారిత వ్యవస్థ అని వివరించారు. స్థానిక అమెరికన్లతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తేనే ఈ వీసాలు మంజూరవుతాయని లేబర్ నిబంధనలు చెప్తున్నాయి. పైగా, ఉన్నత సాంకేతిక రంగాలైన ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి స్టెమ్ విభాగాలలో మెజారిటీ విద్యార్థులు విదేశీయులే ఉంటున్నారు.
ఒక పరిశోధన ప్రకారం, ప్రతి ఒక్క హెచ్-1బీ ఉద్యోగి పరోక్షంగా మరో రెండు అమెరికన్ ఉద్యోగాల సృష్టికి కారణమవుతున్నారు తప్ప.. స్థానికుల అవకాశాలను హరించడంలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో డిజిటల్ మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపుల వేదికగా ఇండియన్ మాఫియా', హిందూ టేకోవర్ వంటి పదజాలంతో వలసదారులపై దుష్ప్రచారం ఓ రేంజ్ లో సాగుతోంది. స్థానిక పోలీస్ రికార్డుల ప్రకారం ఫ్రిస్కో నగరంలో ఎలాంటి హెచ్-1బీ మోసాల కేసులు నమోదు కాలేదని స్పష్టమవుతున్నా.. సోషల్ మీడియాలో అలెజ్డ్ అంటే ఆరోపణలు అనే పదాన్ని వాడుతూ దుష్ప్రచారం మాత్రం అదుపులేకుండా సాగుతోంది. ఇండియాలోని కొన్ని ఎడిట్ చేసిన నకలీ వీడియోలను చూపిస్తూ ఇక్కడి వలసదారుల ప్రవర్తనను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో అమెరికాలో ఆసియన్లపై, సిక్కులపై జరుగుతున్న ద్వేషపూరిత దాడుల గురించి మాట్లాడకపోవడం ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది.
భారతీయ సమాజం కేవలం ఆర్థికంగా, విద్యాపరంగానే కాకుండా అమెరికన్ సంస్కృతిలో భాగమవడంలోనూ ముందుంటోంది. ఇక్కడి ప్రజలు థాంక్స్ గివింగ్, క్రిస్మస్ వంటి పండుగలను స్థానికులతో కలిసి జరుపుకుంటూనే.. సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. హై స్కిల్స్, మంచి నైతిక విలువలతో పాటు ఇతరులను తమ మతంలోకి మార్చాలనే ఎలాంటి బలవంతపు ఆలోచనలు లేని హిందూ ధర్మం.. స్థానిక సంస్కృతికి ఎన్నడూ భంగం కలిగించలేదు. తాము చట్టబద్ధంగా వచ్చి.. పన్నులు చెల్లిస్తూ అమెరికా నిర్మాణంలో భాగస్వాములవుతున్నామే తప్ప, తామేదో అందరికంటే ఉత్తమ వలసదారులమనే అహంకారం భారతీయులకు ఆ ఇడియన్ అమెరికన్ మహిళ ఉద్ఘాటించారు.
అమెరికాను భారతీయులు ఆక్రమిస్తున్నారు అని విమర్శించే వారు.. ఒకసారి ఈ దేశ చరిత్రను తిరగేయాల్సిన అవసరం ఉంది. అసలైన స్థానిక నివాసితులైన నేటివ్ అమెరికన్లను పక్కన పెడితే, నేడు తామే అసలైన అమెరికన్లమని చెప్పుకునే శ్వేతజాతీయులు కూడా ఒకప్పుడు ఐరోపా దేశాల నుంచి వలస వచ్చిన వారి సంతతే అన్నది చారిత్రక సత్యం. చారిత్రక పరిణామాల వల్ల పూర్వీకులు ఎప్పుడు వచ్చారో తెలియని స్థితిలో కొందరు స్థానికులు ఉంటే.. నేటి కొత్త వలసదారులు మాత్రం తమ వీసా, గ్రీన్ కార్డ్, నేచురలైజేషన్ పత్రాలతో చట్టబద్ధంగా అడుగుపెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారనే దానికంటే, ఇక్కడికి వచ్చాక దేశ పురోగతికి ఏ మేరకు శ్రమిస్తున్నారనే సంస్కృతిపైనే అమెరికా ఆర్థిక వృద్ధి ఆధారపడి ఉంది.
ఈ మొత్తం పరిణామాలపై భిన్నమైన విశ్లేషణలు కూడా వస్తున్నాయి. జనాభా మార్పుల వేగాన్ని చూసి స్థానికులు ఆందోళన చెందడం సహజమేనని, జనాభా పరిమాణాల నియంత్రణపై లేదా వేతన రక్షణలపై మాట్లాడినంత మాత్రాన వారిని రేసిస్ట్ లుగా ముద్ర వేయలేమని కొందరు వాదిస్తున్నారు. అయితే.. విధానపరమైన మార్పుల గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉన్నప్పటికీ, ఆ నెపంతో వలస వచ్చిన నిపుణులపై ద్వేషాన్ని సాధారణీకరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అనడంలో సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ, చారిత్రక సత్యాలను, ఖచ్చితమైన డేటాను పక్కనబెట్టి వలసదారులపై అపోహలు పెంచడం సరికాదనే వాదన బలంగా వినిపిస్తోంది. అమెరికా దేశ గొప్పతనం ఎప్పుడూ సరిహద్దుల చుట్టూ గోడలు కట్టడంలో లేదు.. ప్రతిభను గుర్తించి తలుపులు తెరవడంలోనే ఉందనే నిజాన్ని ఈ పరిణామాలు గుర్తుచేస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి అపోహలను తొలగించుకుంటూ పరస్పర గౌరవంతో ముందుకు సాగినప్పుడే అమెరికన్ డ్రీమ్ మరింత బలోపేతం అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






