యుకేలో గ్రూమింగ్ గ్యాంగ్స్.. వ్యవస్థీకృత నేరాలు.. భయంకర వాస్తవాలు

posted on: May 1, 2026 3:19PM

యునైటెడ్ కింగ్‌డమ్‌లో గత రెండు దశాబ్దాలుగా వెలుగులోకి వస్తున్న 'చైల్డ్ గ్రూమింగ్' సంఘటనలు అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పాకిస్థాన్ మూలాలు ఉన్న ముస్లింలు..   రోథర్‌హామ్, రోచ్డేల్, ఆక్స్‌ఫర్డ్‌షైర్ వంటి నగరాల్లో ముఠాలుగా ఏర్పడి చిన్నారులపై సాగిస్తున్న లైంగిక దోపిడీ (  కేసులు నాగరిక సమాజానికి సవాలుగా మారాయి. మైనర్లను లక్ష్యంగా చేసుకుని.. వారి బలహీనతలను ఆసరాగా తీసుకుని అత్యంత క్రూరంగా వలలో వేసుకుంటున్న ఈ నెట్‌వర్క్‌ల పనితీరుపై ఇటీవల అధికారిక నివేదికలు సంచలన విషయాలను వెల్లడించాయి. ఇవి కేవలం విడివిడిగా జరుగుతున్న నేరాలు కావు, ఒక పక్కా ప్రణాళికతో జరుగుతున్న వ్యవస్థీకృత దాడులని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేరగాళ్ల నెట్‌వర్క్‌లు సాధారణంగా రద్దీగా ఉండే టౌన్ సెంటర్లు, షాపింగ్ మాల్స్,  ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వద్ద మాటు వేసి.. ఒంటరిగా ఉండే పిల్లలను, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న టీనేజర్లను గుర్తిస్తాయి. మొదట 'కేర్' చూపిస్తున్నట్లు నటిస్తూ, స్నేహపూర్వకంగా దగ్గరవుతారు. నిందితులు పిల్లలకు బహుమతులు ఇవ్వడం..  విలాసవంతమైన కార్లలో రైడ్‌లకు తీసుకెళ్లడం,  ఖరీదైన గిఫ్ట్‌లతో ఆకట్టుకోవడం ద్వారా వారి నమ్మకాన్ని చూరగొంటారు. ఈ ప్రక్రియనే  గ్రూమింగ్ అంటారు. ఇక్కడ బాధితులు తమను రక్షించే వ్యక్తులుగా నేరగాళ్లను నమ్మడం ప్రారంభిస్తారు.

నేరగాళ్ల అసలు స్వరూపం నమ్మకం కుదిరిన తర్వాత బయటపడుతుంది. బాధితులకు మద్యం, డ్రగ్స్ అలవాటు చేసి, వారిపై పూర్తి నియంత్రణ సాధిస్తారు. ఒకసారి లైంగిక సంబంధం ఏర్పడిన తర్వాత..  ఆ దృశ్యాలను రికార్డ్ చేయడం లేదా డ్రగ్స్ వాడుతున్నట్లు ఇంట్లో చెబుతామని బ్లాక్‌మెయిల్ చేయడం వంటి చర్యలకు పాల్పడతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..  ఒక వ్యక్తితో మొదలైన ఈ సంబంధం  మెల్లగా ముఠా సభ్యులందరికీ పాకుతుంది. బాధితులను ఒకరి నుంచి మరొకరికి  పాస్' చేస్తూ, రోజుకు పలువురు వ్యక్తులు వారిపై అఘాయిత్యాలకు పాల్పడేలా ఈ నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయి.

బాధితుల ప్రొఫైల్‌ను పరిశీలిస్తే.. వీరంతా 11 నుంచి 17 ఏళ్ల లోపు బాలికలే . ఔను బాలికలే ఎక్కువగా ఈ ముఠాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఫోస్టర్ కేర్ (దత్తత గృహాలు)లో ఉండేవారు, పేదరిక నేపథ్యం ఉన్నవారు,  మానసిక ఒత్తిడికి లోనవుతున్న చిన్నారులను ఈ ముఠాలు సులభంగా లక్ష్యం చేసుకుంటున్నాయి. వ్యవస్థీకృత వైఫల్యాలు కూడా ఈ నేరాలు పెరగడానికి కారణమయ్యాయని విమర్శలు ఉన్నాయి. గతంలో పోలీసులు,  సోషల్ సర్వీసెస్ అధికారులు బాధితుల ఫిర్యాదులను సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇది వారి వ్యక్తిగత జీవనశైలిగా భావించడం వంటివి నేరగాళ్లకు అండగా మారాయి. కొన్ని చోట్ల రాజకీయ సున్నితత్వం,  జాతి వివక్ష ఆరోపణల భయంతో అధికారులు కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఈ గ్రూమింగ్ పద్ధతులు మరింత ప్రమాదకరంగా మారాయి. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్ ద్వారా అపరిచితులు పిల్లలతో పరిచయాలు పెంచుకుంటున్నారు. నకిలీ ప్రొఫైళ్లతో పిల్లల వయసు వారమని నమ్మిస్తూ..  వారి వ్యక్తిగత సమాచారం, ఫొటోలను  సేకరించి ఆపై వేధింపులకు గురిచేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా మొదలయ్యే ఈ గ్రూమింగ్, చివరికి ప్రత్యక్ష దోపిడీకి దారితీస్తోంది. దీనిని అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన చట్టాలను,  జాతీయ ఆడిట్లను  ప్రవేశపెట్టింది.

యూకే ప్రభుత్వం 2020లో యుకే హోమ్ ఆఫీస్  Group-based Child Sexual Exploitation: Characteristics of Offending  అనే కీలక పేపర్ విడుదల చేసింది. అలాగే.. 2025లో బారోనెస్ కేసీ నేతృత్వంలో నేషనల్ ఆడిట్ ఆన్ గ్రూప్-బేస్డ్ CSE & అబ్యూస్ నిర్వహించింది. అదే ఏడాది యుకే ప్రభుత్వం స్టాట్యూటరీ ఇండిపెండెంట్ ఇన్క్వైరీ ఇన్టూ గ్రూమింగ్ గ్యాంగ్స్ ను ఏర్పాటు చేసింది. గత కేసుల్లో సిస్టమిక్ వైఫల్యాలు ఏమిటో గుర్తించడం, భవిష్యత్తులో పిల్లల రక్షణకు అవసరమైన చట్ట, విధాన మార్పులు సూచించడం దీని లక్ష్యం. 

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కేవలం చట్టాల ద్వారానే సాధ్యం కాదు. కుటుంబాలు,  విద్యా సంస్థలు కీలక పాత్ర పోషించాలి. పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు, వారు కొత్తగా ఎవరితోనైనా రహస్యంగా స్నేహం చేయడం, విలాసవంతమైన వస్తువులు కలిగి ఉండటం వంటి అంశాలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. పాఠశాలల్లో లైంగిక విద్య,  ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా పిల్లలు తమను తాము రక్షించుకునేలా చేయవచ్చు.

భవిష్యత్తులో ఇలాంటి ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు, సోషల్ సర్వీసెస్ మరియు కమ్యూనిటీలు సమన్వయంతో పనిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర విచారణ కమిషన్లు ఇచ్చే సిఫార్సుల ఆధారంగా చైల్డ్ ప్రొటెక్షన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల భద్రత మరియు గౌరవం కాపాడటం అనేది కేవలం ఒక దేశ బాధ్యత మాత్రమే కాదు, అది నాగరిక సమాజం యొక్క ప్రాథమిక లక్ష్యం కావాలి.

- సీతారాం కంఠంనేని

References

1.    Home Office (UK) – Group-based Child Sexual Exploitation: Characteristics of Offending (2020) GOV.UK
2.    UK Parliament – Written Statement on the paper on group-based CSE (HCWS648, 15 Dec 2020) UK Parliament
3.    NSPCC Learning – Summary of the National audit on group-based child sexual exploitation and abuse (Casey review) (2025) NSPCC Learning
4.    Humanium – Confronting group-based child sexual exploitation in the UK (2025) humanium.org
5.    Home Office (UK) – Independent Inquiry into Grooming Gangs – Terms of Reference & Updates (2025–26) GOV.UK

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి  https://www.teluguone.com  ఫాలో అవ్వండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...