విజయవంతంగా హెర్మూజ్ దాటి ఇండియా చేరిన గ్రీన్ ఆశా

posted on: Apr 9, 2026 3:17PM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత్‌కు చెందిన 'గ్రీన్ ఆశా' అనే భారీ ఎల్పీజీ నౌక సురక్షితంగా హెర్మూజ్ జలసంధి దాడి ఇండియా చేరుకుంది.   ప్రపంచ దేశాల ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన, ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారిన హోర్ముజ్ జలసంధిని ఈ నౌక విజయవంతంగా దాటుకుని రావడం విశేషం.

సుమారు 15,400 టన్నుల వంటగ్యాస్ తో ఈ నౌక ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ  వద్ద లంగరు వేసింది. పశ్చిమాసియాలో ఇరాన్,  అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య నెలకొన్న ఘర్షణల కారణంగా హోర్ముజ్ జలసంధి మీదుగా రవాణా చేయడం అత్యంత క్లిష్టంగా మారిన సంగతి విదితమే. ఈ క్రమంలో భారత పతాకంతో ఉన్న గ్రీన్ ఆశా నౌక, హెర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించి భారత్ చేరుకుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత జేఎన్‌పీఏ పోర్టుకు చేరుకున్న తొలి భారతీయ ఎల్పీజీ నౌక ఇదే కావడం గమనార్హం.

ఈ నౌక ప్రయాణం ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య, ప్రమాదాల మధ్యా సాగింది. హోర్ముజ్ జలసంధిలో నియంత్రణను కఠినతరం చేసిన ఇరాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భారత్ ఈ రవాణాను సుసాధ్యం చేసింది. నౌకలోని సిబ్బంది అందరూ భారతీయులేనని స్పష్టం చేస్తూ..  ప్రత్యేక సంకేతాల ద్వారా ఇరాన్ అధికారుల సమన్వయంతో గ్రీన్ ఆశా తన ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఈ నౌకలో ఉన్న ఇంధనం దేశంలోని గృహావసరాలకు ఎంతో కీలకం అనడంతో సందేహం లేదు.  ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇంధన భద్రతను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ పరిణామం మరింత ఉతమిస్తుందనడంలో సందేహం లేదు.    భారత్ దిగుమతి చేసుకునే ఎల్పీజీలో దాదాపు 90 శాతం ఈ మార్గం గుండానే వస్తుంది.

గ్రీన్ ఆశాతో కలిపి ఇప్పటివరకు మొత్తం తొమ్మిది ఇండియా షిప్పులు హెర్మూజ్ జలసంధి గుండా ప్రయాణం సాగించాయి. ఇండియన్ నేవీకి చెందిన యుద్ధనౌకలు కూడా ఈ నౌకల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి.రాబోయే రోజుల్లో మరిన్ని నౌకలు ఇదే మార్గంలో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడే వరకు రవాణా రంగంలో ఇలాంటి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా, అంతర్జాతీయ ఒత్తిళ్ల నడుమ తమ ఇంధన అవసరాల కోసం భారత్ చూపుతున్న దౌత్యపరమైన చొరవ విజయవంతమవుతోందని విశ్లేషిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...