పోరు పడలేకే నరసింహన్ రాజీనామా చేస్తున్నారా?



రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహస్ ను నియమించారు. అయితే విడిపోయిన కొన్ని రోజుల వరకూ బానే ఉన్నా తరువాత నుండే అసలు సమస్య మొదలైంది. రెండు రాష్ట్రాలు ఏదో ఒక వివాదం సృష్టించుకోవడం..  దానిపై వివాదాలు చేసుకోవడం.. దీని పరిష్కారం కోసం గవర్నర్ ను ఆశ్రయించడం.. ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉండడం సరిపోయేది.

కానీ ఎప్పుడైతే నోటుకు ఓటు కేసు బయటకు వచ్చిందో అప్పుటినుండి గవర్నర్ కు మరింత తలనొప్పి ఎక్కువైందనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ అనుకూలమంటూ ఏపీ.. ఏపీకి అనుకూలంగా ఉన్నారంటూ తెలంగాణ వాదులు ఇద్దరు గవర్నపై విమర్శలు చేసినోళ్లే. ఏపీకి సంబంధించిన అంశాలపై తెలంగాణ సర్కారుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. మరోవైపు ఓటుకు నోటు వ్యవహారం.. సెక్షన్ 8 వల్ల  ఏపీకి గవర్నర్ కు మధ్య దూరం ఎక్కువైందనే చెప్పాలి. అంతేకాక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని గవర్నర్ తప్పుపట్టటం.. ఆయన తీరుపై కేంద్రానికి ఇచ్చిన నివేదికతో ఇటు కేసీఆర్ తో గొడవ వచ్చిపడింది.

ఈ రెండు రాష్ట్రాల మధ్య జరిగిన గొడవల పరిణామాల నేపథ్యంలో ఒకానొక సందర్భంలో నరసింహన్ ను తప్పించే అవకాశం ఉందన్నవార్తలు కూడా వచ్చాయి. కాని అది జరగలేదు. అయితే ఇప్పుడు నరసింహనే స్వయంగా తనకు తానుగా పదవి నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆమధ్య ఆగస్టు 15న ఆయన చేసిన నిరాశాపూరిత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని అంటున్నారు. ఎందుకంటే గతంలో గవర్నర్ ఇచ్చిన విందులకు ఇద్దరు ముఖ్యమంత్రులలో ఒకరైనా హాజరయ్యేవారు. కాని ఆగస్టు 15న రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి ఇద్దరు ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టటంతో తనకు తానుగా గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాలని గవర్నర్ యోచిస్తున్నట్లుగా వాదన వినిపిస్తోంది.

మరోవైపు నరసింహనే స్వయంగా పదవి నుండి తప్పుకోవాలని చూస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించాలంటే అందుకు న్యాయనిపుణుడైన వ్యక్తిని గవర్నర్ గా ఎంపిక చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం కేరళ గవర్నర్ గా వ్యవహరిస్తున్నసుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన అయితే రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా సరిపోతారని అందరూ అభిప్రాయపడుతున్నారు.

మరి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పోరు పడలేకే నరసింహన్ పాపం తనకు తానుగా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కొత్తగా వచ్చే గవర్నర్ ఎంతవరకూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న గిల్లికజ్జాలను తీర్చుతారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu