Latest News

గవర్నర్‌ గారు ఏం సమాధానం చెప్తారు?

posted on: Jun 15, 2015 8:58PM


గవర్నర్ పదవి రాజ్యాంగానికి లోబడి వుంటుందని మనం పుస్తకాల్లో చదువుకుని సంతోషిస్తాం. అయితే రాజకీయ నాయకుల ఆశీస్సులతో దక్కే గవర్నర్ పదవులు కూడా ఇప్పుడు రాజకీయాల పరిధిలోకి వచ్చేశాయి. పైగా గవర్నర్లే రాజకీయాలు నడిపే పరిస్థితి బాగా పెరిగిపోయిన తర్వాత రాజకీయ నాయకులకు, గవర్నర్లకు పెద్ద తేడా కనిపించడం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వున్న నరసింహన్ గురించి, ఆయన రాజకీయ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవాలు ఎలా తగ్గుతూ పెరుగుతూ వుంటాయో, గవర్నర్ల ప్రతిష్ట కూడా అలా తగ్గుతూ పెరుగుతూ వుంటుంది. నరసింహన్ గవర్నర్ అయిన కొత్తలో అందరూ మాజీ పోలీస్ ఆఫీసర్ కదా... వెన్నెముక నిటారుగా వుంచి పనిచేస్తారని అందరూ భ్రమించారు. అయితే ఆ భ్రమలు కొద్దికాలానికే పూర్తిగా తొలగిపోయాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొత్తం అడుగంటిపోయాయి. ఇప్పుడు ఆయన అధికారాంతంలో వున్న ఫీలింగ్ అందరికీ కలుగుతోంది. ఈ నేపథ్యంలో జెంటిల్మన్‌గా పేరున్న కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి గవర్నర్‌ గారికి ఒక ప్రశ్న సంధించారు. ఆ ప్రశ్నకు గవర్నర్ సమాధానం చెప్తారన్న ఆశలు లేవు. అయితే ఆ ప్రశ్న మాత్రి ఆయన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయినా వెంటాడుతూనే వుంటుంది.

తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో వున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని మీద పోటీ చేసి ఓడిపోయిన శశిధర్ రెడ్డికి కూడా ఈ విషయం అర్థం కావడం లేదు. అందుకే ఆయన తెలంగాణ స్పీకర్‌కి ఓ లేఖ రాశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టా లేదా అనే విషయాన్ని తెలియజేయాల్సిందిగా ఆ లేఖలో ఆయన కోరారు. అలాగే పనిలో పనిగా గవర్నర్ నరసింహన్‌ని ఒక ప్రశ్న అడిగారు. అధికారికంగా తెలుగుదేశం పార్టీ శాననసభ్యుడిగా వున్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని గవర్నర్ టీఆర్ఎస్ మినిస్టర్‌గా ఏ చట్ట ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారో చెప్పాలని కోరారు. టీడీపీకి రాజీనామా చేసిన వ్యక్తిగా ప్రమాణస్వీకారం చేయించారా లేక టీడీపీ ఎమ్మెల్యే హోదాలోనే ప్రమాణ స్వీకారం చేయించారా అనేది తేల్చి చెప్పాలని ఆయన కోరారు.  మరి ఈ ప్రశ్నకు గౌరవనీయులైన గవర్నర్ గారు సమాధానం చెబుతారంటారా?

google-ad-img
    Related Sigment News
    • Loading...