త్వరలో గవర్నర్ మార్పు..నరసింహన్ తెలంగాణాకే పరిమితం?
posted on: Jun 11, 2015 8:35PM
.jpg)
రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ తెలంగాణా ప్రభుత్వం వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఆంద్రప్రదేశ్ మంత్రులలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన అనేక వినతి పత్రాలపై ఆయన ఎటువంటి చర్య చేప్పట్టకపోవడమే కాకుండా తెలంగాణా ప్రభుత్వానికి కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొందరు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెదేపాకు చెందిన యంయల్యేలను ముఖ్యమంత్రి తెరాసలోకి ఆకర్షించి వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటివారికి మంత్రి పదవులు కట్టబెడుతుంటే, అటువంటి రాజ్యాంగ విరుద్దమయిన చర్యలను గవర్నర్ అడ్డుకోకపోగా వారిచేత ప్రమాణస్వీకారం కూడా చేయించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.
విభజన బిల్లులో సెక్షన్ 8 ప్రకారం ఆయన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అన్ని ప్రభుత్వ వ్యవస్థలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. కానీ తెదేపా యంయల్యే రేవంత్ రెడ్డిపై ఎసిబి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ గురించి ఆయనకి ఎటువంటి ముందస్తు సమాచారం లేనట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆ తరువాత బయటపడిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కూడా ఆయనకు ఇంతవరకు సమాచారం లేకపోవడంతో ఆయనకు హైదరాబాద్ నగరంలో ఏమి జరుగుతోందనే విషయంపై సరయిన సమాచారం కానీ, అవగాహన గానీ లేదనే విషయం రుజువయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గవర్నర్ నిర్లిప్తత పట్ల ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తిగా ఉన్నారనే విషయం నిన్న మొట్టమొదటిసారిగా బయటపడింది. తమ పార్టీ యం.యల్యేగా కొనసాగుతున్న తలసానికి ఆయన ఏవిధంగా పదవీ ప్రమాణం చేయించారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో సంపూర్ణాధికారాలు గవర్నర్ కే కట్టబెట్టాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయనను మార్చితే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం వద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితులలో మరి ఆయనని మార్చుతుందో లేకపోతే ఆయనను తెలంగాణాకు పరిమితం చేసి ఆంధ్రాకు మరో గవర్నర్ నియమిస్తుందా? లేక ఆయననే కొనసాగిస్తుందా...అనేది త్వరలోనే తెలియవచ్చును. కానీ నిన్న హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు తారసపడినప్పుడు, ఆయనని పిలిచి మరీ ఫోటో తీయించుకొన్నారు ఎందుకో...? ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒకపని మీద వచ్చి కలుస్తూనే ఉంటారు. అలా కలిసినప్పుడల్లా మీడియా వాళ్ళు నిత్యం వారి ఫోటోలు తీస్తూనే ఉంటారు. మరి అటువంటప్పుడు డిల్లీలో చంద్రబాబు ఎదురపడినప్పుడు పనిగట్టుకొని ఆయనతో ఫోటో ఎందుకు తీయించుకొన్నారనే సందేహం కలగడం సహజం. బహుశః కేంద్ర ప్రభుత్వం ఆయనని మార్చబోతున్నట్లు ఏమయినా సంకేతాలు ఇచ్చినందునే ఆయన ఫోటో దిగారా? లేక కేవలం యాదృచ్చికంగానే ఆవిధంగా చేసారా? అనే విషయం కూడా త్వరలోనే తెలియవచ్చును.
ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం నెలకొన్న యుద్ద వాతావరణ గురించి మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ‘త్వరలోనే అన్నీ సర్దుకొంటాయి,’ అని చెప్పారు. ఆయన జవాబు వింటే ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కేంద్ర ప్రభుత్వం రాజీ కుదుర్చుతుందని సూచిస్తున్నట్లుంది. లేకుంటే ఇంతవరకు వచ్చిన తరువాత అన్నీ త్వరలోనే సర్దుకోవడం అసంభవమని అందరికీ తెలుసు. ఏమయినప్పటికీ మరొక్క వారం రోజులలోనే కేంద్రప్రభుత్వం తన వైఖరిని మెల్లగా బయటపెట్టవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



.jpg)
.jpg)


.webp)


