కేసీఆర్ విందుకు వెళ్తే బాగుండేది
posted on Jun 30, 2015 11:24PM

రేవంత్ రెడ్డి బెయిల్ దెబ్బకి కేసీఆర్‌కి జ్వరం వస్తే వచ్చింది... రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన విందుకు సతీసమేతంగా వెళ్ళి వుండాల్సిందని టీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు కేసీఆర్ ఆ విందుకు హాజరు కాకపోవడం వల్ల... ఆయనకు నిజంగానే జ్వరం వచ్చిందో... లేక చంద్రబాబును ఫేస్ చేయలేకే ఆయన జ్వరం వచ్చిందన్న సాకు చెప్పారోనని గిట్టని వారు అనడం తమకు బాధను కలిగిస్తోందని వారు వాపోతున్నారట. వారికి ఇంకా బాధను కలిగిస్తున్న అంశాలు ఇంకా చాలా వున్నాయి. మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకే అన్నట్టుగా, కేసీఆర్ ఆ విందుకు వెళ్ళని విషయం అలా వుంచితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ విందుకు వెళ్ళారు... అదీ అసలు సమస్య. రాష్ట్రపతిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన కేసీఆర్ దఢేల్మని ఆయన కాళ్ళమీద పడిపోయారు అంతవరకూ ఓకే. రాష్ట్రపతి విమానం దిగిన హకీంపేట జీహెచ్ఎంసీ పరిధిలో లేదు కాబట్టి, అక్కడ తనకు సరైన స్థాయిలో గౌరవం లభించదు కాబట్టి చంద్రబాబు రాష్ట్రపతిని రిసీవ్ చేసుకోలేకపోయారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు రాష్ట్రపతిని ప్రత్యేకంగా కలిశారు. గవర్నర్ విందు సందర్భంగా మరోసారి కలిశారు. రాష్ట్రపతి తిరుపతి పర్యటన సందర్భంగా ఇంకోసారి కలుస్తారు. వీలయితే మరో రెండుమూడుసార్లు రాష్ట్రపతిని కలిసే అవకాశం వుంది. ఈ భేటీల్లో చంద్రబాబు రాష్ట్రపతిని ఇంప్రెస్ చేసి కేసీఆర్ కంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తే ఎలా అనే బాధ ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలను పీడిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే జ్వరం నిజంగానే వచ్చిందో లేదో తెలియదుగానీ, ఒకవేళ నిజంగానే జ్వరం వచ్చినా పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకుని అయినా విందుకు వెళ్తే బాగుండేదన్న అభిప్రాయాలు టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.