ఈ టెన్షన్ తట్టుకోలేం దేవుడా
posted on Jun 26, 2015 10:01PM

తెలుగు రాజకీయాలను గమనిస్తూ వుండేవారు రాష్ట్ర విభజన జరక్కముందు చాలా ఉత్కంఠకు, టెన్షన్‌కి గురయ్యేవారు. రాష్ట్ర విభజన విషయంలో ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందా అని ఉక్కరిబిక్కిరి అయ్యేవారు. అప్పట్లో గవర్నర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా, ఆయన పర్యటన వెనుక వున్న అసలు రహస్యం ఏమిటో... రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వుంటుందా, లేక రాష్ట్ర విభజనకు అనుకూలంగా వుంటుందా అనే టెన్షన్ రెండు వర్గాల వారిలోనూ వుండేది. మొత్తానికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ టెన్షన్, ఉత్కంఠ తగ్గిపోయింది. గవర్నర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా అది ఆయన మీడియాకు చెప్పినట్టుగానే ‘రొటీన్’ పర్యటన అనుకునేవారు. అయితే ఇటీవలి కాలంలో రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కడంతో ఇప్పుడు మళ్ళీ గవర్నర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆయన అక్కడ ఏ నివేదిక ఇవ్వడానికి వెళ్ళారో, ఈయన పర్యటన సందర్భంగా కేంద్రం ఏదైనా సంచలనాత్మక ప్రకటన చేస్తుందా అని ఎదురు చూడటం మామూలైపోయింది. ఓటుకు నోటు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సెక్షన్ 8 అంశం తెరమీదకి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ నరసింహన్ ఢిల్లీకి వెళ్ళడం రెండు రాష్ట్రాల వారిలో టెన్షన్ని కలిగిస్తోంది. ఆయన పర్యటన తమకు అనుకూలంగా వుందా, వ్యతిరేకంగా వుందా.. ఆయన హోంశాఖ మంత్రిని, హోంశాఖ కార్యదర్శిని కలసి, గంటలు గంటలు చర్చించారంటే ఏదైనా కీలక నిర్ణయాన్ని ప్రకటించడానికేనా అనే టెన్షన్ తెలుగు జనాల్లో పుడుతోంది. అంచేత గవర్నర్ గారు ఇంకా టెన్షన్ పెట్టకుండా ఏదో ఒక ‘కీలక’ నిర్ణయాన్ని ప్రకటించి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ధన్యుల్ని చేయాలని విజ్ఞప్తి.