పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్

posted on: Jan 26, 2026 1:02PM

 

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నట్లు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు.హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరేడ్ మైదానంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారిక గౌరవ వందనం స్వీకరించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, రైతుల సంక్షేమం సహా అనేక అభివృద్ధి పనులపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. సామాజిక పెన్షన్లు, దీపం పథకం ద్వారా పేదలు, మహిళలకు మద్దతు అందిస్తున్నాట్లు గవర్నర్ తెలిపారు. సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు.

నీటి భద్రతను ప్రధాన విధానంగా తీసుకుని పోలవరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ‘పొలం పిలుస్తోంది’, ‘రైతన్న మీ కోసం’ వంటి కార్యక్రమాల ద్వారా నేరుగా మద్దతు అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు. రవాణా రంగంలో రోడ్డు, రైల్వే, జల రవాణాకు సమాన ప్రాధాన్యం ఇస్తూ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పూడ్చేలా చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు విశాఖను ఎకనామిక్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. విద్యుత్ రంగంలో ట్రూ డౌన్ చార్జీల అమలుతో వినియోగదారులపై భారం తగ్గించామని వివరించారు.

ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం, ప్లగ్ అండ్ ప్లే విధానం, టూరిజం పాలసీ 2024–29 అమలు, స్వచ్ఛ ఆంధ్ర – సేఫ్ ఆంధ్ర కార్యక్రమాలు, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఏఐ టెక్నాలజీపై దృష్టి వంటి అంశాలను గవర్నర్ తెలిపారు. 2047 ‘స్వర్ణ ఆంధ్ర’ విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వైజాగ్, విజయవాడల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...