జలవివాదాలతో ప్రభుత్వాల రాజకీయం.. ఏబీవీ

నీటి వివాదాలను ప్రభుత్వాలే రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు.   రాయలసీమ ప్రాంతంలోని నీటి పారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనంలో భాగంగా ఆదివారం (అక్టోబర్ 26)    కడప ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.  

కడప ,చిత్తూరు జిల్లాల జీవనాడి అయిన గాలేరు నగరి సుజల స్రవంతి నిధుల కొరత,  అటవీ అనుమతుల మంజూరులో జాప్యం వల్ల నాలుగు దశాబ్దాలుగా నత్తనడక నడుస్తోందని విమర్శించారు.  హంద్రీనీవా రెండో దశ అనుసంధానం పేరుతో కండలేరు -కరకంపాడి ఎత్తిపోతల పథకం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గాలేరు నగరి సుజల స్రవంతి 100శాతం  గ్రావిటీ కలిగిన ప్రాజెక్టన్నారు.  గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, రాజోలి ప్రాజెక్టుల పూర్తికి, పంట కాలువల నిర్మాణానికి నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న  ప్రభుత్వం పోలవరం బనకచర్ల ఎత్తిపోతల పథకం పేరుతో 85 వేల కోట్ల రూపాయలు కేటాయించడాన్ని తప్పుపట్టారు.

ఈ ప్రాజెక్టు  రాష్ట్ర ప్రజల పై అదనపు భారాన్ని మోపడానికి తప్ప మరెందుకూ పనికిరాదన్నారు.   గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పేరుతో రాయలసీమ ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాల వివాదాలకు ఆజ్యం పోయడమేనని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఎక్కడైనా ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో ఈపీసీ విధానం అమలు చేసేవారని కానీ ప్రస్తుతం పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు నిర్మాణం, అనుమతులు కూడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం అంటే ప్రాజెక్టు మొత్తం ప్రైవేటుపరం చేసి దోపిడీకి ద్వారాలు తరచడమేనని విమర్శించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu