రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే దుర్మరణం
posted on: Jun 3, 2014 9:18AM
.jpg)
కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గోపీనాథ్ ముండే ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యి డిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన డిల్లీ నుండి ముంబాయి బయలుదేరిన ఆయన విమానాశ్రయానికి వెళుతుండగా ఆయన కాన్వాయ్ అదుపుతప్పడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయనను వెంటనే డిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, గుండెపోటుతో మరణించారు. ఆసుపత్రి చేరేసరికే అంతర్గత రక్తస్రావం వల్ల ఆయన పరిస్థితి చాల విషమంగా ఉంది. ఆసుపత్రిలో చేర్చిన కొద్ది సేపటికే ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ దృవీకరించారు. ముండే కుటుంబ సభ్యులు కొంత సేపటి క్రితమే ముంబై నుండి డిల్లీ బయలు దేరి వెళ్ళారు.
గోపీనాథ్ ముండేను రాజకీయాలలోకి తీసుకు వచ్చిన వ్యక్తి బీజేపీ సీనియర్ నేత ప్రమోద్ మహాజన్. వారిరువురూ కాలేజీ చదువుల సమయం నుండే మంచి స్నేహితులు. అందువల్ల మహాజన్ తన సోదరి ప్రద్న్యాను ముండేకిచ్చి వివాహం చేసారూ. దానితో వారిరువురి మద్య స్నేహబందం మరింత బలపడింది. ఎమర్జెన్సీ సమయంలో ముండే అఖిల భారతీయ విద్యా పరిషత్ తరపున ఉద్యమాలు చేసి జైలుకి కూడా వెళ్ళారు. 1971లో భారతీయ జన సంఘ్ లో చేరికతో ముండే రాజకీయ జీవితం ఆరంభమయింది. ఆ తరువాత కొంత కాలానికి ఆయన బీజేపీ మహారాష్ట్ర శాఖ యువ మోర్చా అధ్యక్షుడుగా నియమితులయినారు. 1995లో మనోహర్ జోషి ప్రభుత్వంలో ఆయన ఉపముఖ్యమంత్రిగా పనిచేసారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గోపీనాథ్ ముండే బీడ్ లోక్ సభ నియోజక వర్గం నుండి రెండు లక్షల మెజార్టీతో విజయం సాధించి కేంద్రమంత్రిగా బాధ్యతలు చెప్పట్టారు. కానీ ఆయన జీవితంలో అత్యున్నత స్థానం చేరుకొన్న ఈ తరుణంలో ఆయన దుర్మరణం చెందడం కుటుంబ సభ్యులనే కాదు , పార్టీ నేతలను, ఆయన అనుచరులను కూడా తీవ్రంగా కలచి వేస్తోంది. గోపీనాథ్ ముండే కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్ట మొదటి సారిగా తన స్వరాష్ట్రమయిన మహారాష్ట్రకు వస్తునందున, ముంబైయిలో ఆయనకు స్వాగతం పలికేందుకు స్థానిక బీజేపీ నేతలు కార్యకర్తలు ఘనంగా ఏర్పాట్లు చేసారు. కానీ ఊహించని విధంగా ఆయన మరణవార్త వినవలసి రావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ముండే అంత్యక్రియలు రేపు ఆయన స్వరాష్ట్రంలో జరుగవచ్చును.



.jpg)


.webp)



