యుపిఎ జీఓఎంలు రద్దు: దరిద్రం వదిలింది

posted on: Jun 1, 2014 11:47AM

 

భారతీయ పౌరుడి పాదాల కిందపడి దుర్మరణం పాలైపోయి, చరిత్రలో సమాధి అయిపోయిన యు.పి.ఎ. గవర్నమెంట్ తాలూకు చేదు జ్ఞాపకాలను ఒక్కొక్కదాన్నే తొలగించే పనిలో దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీగా వున్నారు. దీనిలో భాగంగా, యుపిఎ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన బోలెడన్ని మంత్రుల బృందాలను (జీఓఎంలు) రద్దుచేసి పారేశారు. యుపిఎ ప్రభుత్వం ఏ విషయాన్నయినా నాన్చాలన్నా, ఏదైనా విషయంలో ప్రజలకు విసుగు పుట్టించాలన్నా సదరు అంశాల మీద ఓ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసేది. సదరు మంత్రుల బృందాలు తమ ఇష్టం వచ్చినట్టుగా సదరు సమస్యతో ఆడుకునేవి. ఇలాంటి బృందాలు యుపిఏ ప్రభుత్వం దాదాపు యాభై వరకూ ఏర్పాటు చేసింది. ఆ బృందాలు టైమ్ పాస్ చేయడం తప్ప ఊడబొడిచిందేమీ లేదు. ఏదైనా ఒక మంత్రుల బృందం ఏదైనా విషయాన్ని త్వరగా తెమిల్చినా, అది జనం బుర్రలు బద్దలు కొట్టే నిర్ణయాలే తప్ప మంచి నిర్ణయాలేవీ లేవు. సోనియాగాంధీ చెప్పినట్టే మంత్రుల బృందాలు పనిచేసేవి. సోనియాగాంధీ ఎలాంటి ఫలితం రావాలని కోరుకుంటే అలాంటి ఫలితాన్నే ఈ బృందాలు ఇచ్చేవి. సదరు బృందాలు ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం మంత్రివర్గంతో సంబంధం లేకుండా ఆ నిర్ణయాలు అమల్లోకి వచ్చేవి. దాంతో మంత్రిమండలి అనుమతి లేకుండా ఎన్నెన్నో బండలు దేశప్రజల నెత్తిన పడ్డాయి. ఒక దశలో దేశ ప్రజలు మంత్రుల బృందం అనే మాట వింటేనే చిరాకుపడే స్థితికి చేరుకున్నారు. యుపిఎ ప్రభుత్వం చేసిన విఫల ప్రయోగం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రక్రియకు నరేంద్రమోడీ మంగళం పాడటం ఒక మంచి పరిణామమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...