గోదావరి పుష్కరాలు ఎప్పటి నుంచంటే?

posted on: May 18, 2026 2:16PM

తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే గోదావరి  పుష్కరాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి సంబంధించిన అధికారిక తేదీలను పండితులు, అధికారులు ప్రాథమికంగా ఖరారు చేశారు. పుష్కరాల తేదీలు వెల్లడి కావడంతో భక్తులతో పాటు దేవాదాయ శాఖ కూడా అప్పుడే ప్రాథమిక ఏర్పాట్లపై దృష్టి సారించింది.

గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 న అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి 12 రోజుల పాటు సాగే ఈ పుష్కరాలలో గోదావరి నదిలో భక్తులు  పుణ్యస్నానాలు ఆచరించేందుకు  ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే ఈ పుష్కరాలకు మహాకుంభమేళ తరహాలో ఏర్పాట్లు చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.  

ఈ పుష్కర ఉత్సవాలకు చారిత్రక నగరం  రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా నిలవనుంది. తూర్పు గోదావరి జిల్లా పరిధితో పాటు నదీ పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని అన్ని ప్రముఖ ఘాట్లలోనూ భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. గురుడు సింహరాశిలో ప్రవేశించే పవిత్ర ఘడియల్లో ఈ వేడుకలు జరగనున్నాయి.

గతంలో జరిగిన పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే  మహా కుంభమేళా తరహాలో ఈ గోదావరి పుష్కరాలను డిజిటల్ హంగులతో, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.  

పుష్కరాల  సమయంలో భారీ సంఖ్యలో  తరలివచ్చే దేశ, విదేశీ భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్ల విస్తరణ, రహదారుల నిర్మాణం, రవాణా సౌకర్యాల మెరుగుదల వంటి  వాటిపై దృష్టి పెట్టిన అధికారులు ఇప్పటికే ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు.  12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ  ఆధ్యాత్మిక వేడుకను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.  

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, ఆగమ,  వైదిక పండితుల సమక్షంలో చర్చించి, శాస్త్రోక్తంగా పుష్కరాల ప్రారంభ ముహూర్తం వచ్చే ఏడాది జూన్ 26గా ఖరారు చేసినట్లు  దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...