Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గోబర్‌ధన్ పథకం గొప్పదే కానీ..!
posted on: Aug 14, 2026 6:19AM

కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 23 వేల 731 కోట్ల రూపాయల గోబర్‌ధన్ బయోఎనర్జీ పథకం భారత ఇంధన విధానంలోకీలక మలుపు. అయితే ఇది కేవలం ఆవు పేడతో కారు నడుస్తుంది అనే ప్రచార వాక్యంగా మిగిలిపోతుందా, లేక దిగుమతి గ్యాస్‌పై ఆధారాన్ని తగ్గించే వ్యవస్థగా రూపాంతరం చెందుతుందా అనేది వచ్చే పదేళ్ల అమలే నిర్ణయిస్తుంది.
భారత్ E20 ఇథనాల్ మిశ్రమ విధానంతో పెట్రోల్ రంగంలో సృష్టించిన తప్పనిసరి కొనుగోలు-డిమాండ్ వ్యవస్థను, ఇప్పుడు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ/బయో-సీఎన్‌జీ) రంగానికి విస్తరించాలనుకుంటోంది. కాని ఇథనాల్‌ను చెరకు, ధాన్యాలు, డిస్టిలరీ పరిశ్రమల వంటి తులనాత్మకంగా వ్యవస్థీకృత సరఫరా గొలుసు నడిపిస్తే.. బయో-సీఎన్‌జీకి అవసరమైన పేడ, పంట అవశేషాలు, తడి చెత్త, ప్రెస్‌మడ్ వంటి ముడిసరుకు సేకరణ సంక్లిష్టమైన స్థానిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.
గోబర్‌ధన్ పథకం అసలు పరీక్ష గ్యాస్ ఉత్పత్తిలో కాదు.. ప్రతిరోజూ నిరంతరంగా ముడిసరుకు సేకరించడం, నాణ్యమైన గ్యాస్‌ను ఉత్పత్తి చేయడం, పైప్‌లైన్‌కు అనుసంధానం చేయడం, రైతుకు న్యాయమైన ధర చెల్లించడం, ప్లాంటును లాభదాయకంగా నడపడం అనే ఐదు దశల్లో ఉంది.
శిలాజ ఇంధనాల పరిమితి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు ఒకటిన్నర శతాబ్దాలుగా బొగ్గు, చమురు, సహజవాయువులపై నిర్మితమైంది. ఇవి ఇప్పటికీ ప్రపంచ ప్రాథమిక ఇంధన వినియోగంలో నాలుగైదు వంతుల వాటాను కలిగి ఉన్నాయి. చమురుకు సుమారు 50 సంవత్సరాలు, సహజవాయువుకు 50 నుంచి 55 సంవత్సరాలు, బొగ్గుకు 130 నుంచి 140 సంవత్సరాల నిల్వ-ఉత్పత్తి నిష్పత్తి ఉంటుందనే లెక్కలు చర్చలో విస్తృతంగా వినిపిస్తాయి. కానీ ఈ సంఖ్యలను అముక్త సంవత్సరం నాటికి ఇంధనం పూర్తిగా అయిపోతుంది అనే గడియారంగా చదవడం తప్పు. ఇవి అప్పటి నిర్ధారిత నిల్వలను, అప్పటి వార్షిక ఉత్పత్తితో భాగించిన గణాంక అంచనాలు మాత్రమే.
కొత్త నిల్వల ఆవిష్కరణలు, షేల్ వంటి సాంకేతిక మార్పులు, అంతర్జాతీయ ధరలు, యుద్ధాలు, పునరుత్పాదక విద్యుత్ విస్తరణ, విద్యుత్ వాహనాల పెరుగుదల, వినియోగ నియంత్రణ వంటి అంశాలు ఈ అంచనాలను మార్చుతాయి. అయినప్పటికీ అసలు వాస్తవాన్ని తప్పించలేం: శిలాజ ఇంధనాలు పునరుత్పత్తి కాని వనరులు. వాటి దహనం వాతావరణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.
ఇక్కడ బయో సీఎన్‌జీకి ఉన్న ప్రాధాన్యం సహజవాయువు అయిపోతుంది కాబట్టి ప్రత్యామ్నాయం అన్న ఒకే కారణంలో లేదు. పేడ, సేంద్రియ వ్యర్థాలు, పంట అవశేషాల నుంచి బయటకు వెళ్లే మీథేన్‌ను నియంత్రితంగా సేకరించి ఇంధనంగా వాడటం ద్వారా వ్యర్థ సమస్య, వాయు కాలుష్యం, గ్రామీణ ఆదాయం, దిగుమతి ఇంధన వ్యయం వంటి అనేక సమస్యలకు ఒకే వేదికపై పరిష్కారం వెతకడంలొ ఉంది. అదే దీని ప్రత్యేకత.
బయో-సీఎన్‌జీ అంటే ఏమిటి?
పశువుల పేడ, ఆహార వ్యర్థాలు, వ్యవసాయ అవశేషాలు, చెరకు కర్మాగారాల ప్రెస్‌మడ్, మునిసిపల్ తడి చెత్త వంటి సేంద్రియ పదార్థాలను ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో సూక్ష్మజీవుల ద్వారా కుళ్లబెట్టి బయోగ్యాస్ తయారు చేస్తారు. దానిలోని కార్బన్ డైఆక్సైడ్, తేమ, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి మలినాలను తొలగించి, మీథేన్ శాతాన్ని ప్రమాణాలకు అనుగుణంగా పెంచి, అధిక పీడనంతో నింపితే అది కంప్రెస్డ్ బయోగ్యాస్ అవుతుంది. శుద్ధి చేసిన సీబీజీ రసాయన పరంగా సహజవాయువులో ప్రధానంగా ఉండే మీథేన్‌కు సమానమైన ఇంధనం. అందువల్ల నాణ్యతా ప్రమాణాలు నెరవేరితే.. ప్రస్తుతం ఉన్న సీఎన్‌జీ వాహనాలు, గ్యాస్ పంపిణీ జాలం, పైప్‌డ్ నేచురల్ గ్యాస్ వ్యవస్థల్లో దీనిని కలపడానికి వాహన ఇంజిన్‌ను మార్చాల్సిన అవసరం ఉండదు.
అయితే దీనిని శూన్య కాలుష్య ఇంధనంగా చిత్రీకరించడం సరైంది కాదు. పంట అవశేషాల రవాణా, ప్లాంటుకు అవసరమైన విద్యుత్, గ్యాస్ శుద్ధి, కంప్రెషన్, లీకేజీలు, డైజెస్టేట్ నిర్వహణ అన్నీ పర్యావరణ ప్రభావాన్ని నిర్ణయిస్తాయి. సరిగా నిర్వహించిన ప్లాంటు వాతావరణ ప్రయోజనం ఇవ్వగలదు. నిర్లక్ష్యంగా నడిపిన ప్లాంటు మీథేన్ లీకేజీలు, దుర్వాసన, నీటి కాలుష్యం, స్థానిక ప్రజా వ్యతిరేకతకు కూడా కారణం కావచ్చు. పేడను వ్యర్థంగా చూసే ఆర్థిక వ్యవస్థ నుంచి, దానిని ఇంధనం, సేంద్రియ ఎరువు, గ్రామీణ ఆదాయ వనరుగా మార్చే వ్యవస్థకు వెళ్లాలన్నదే గోబర్‌ధన్ లక్ష్యం. కానీ రైతు చేతిలో నిజమైన నగదు చేరితేనే ఇది గ్రామీణ ఆర్థిక సంస్కరణ అవుతుంది.
విధాన పరిణామ క్రమం
భారత్ బయోగ్యాస్ రంగానికి కొత్త కాదు. కుటుంబస్థాయి గోబర్ గ్యాస్ యూనిట్ల నుంచి వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాల వరకు అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ భారీ స్థాయి వాణిజ్య బయో-సీఎన్‌జీ రంగానికి 2018లో ప్రారంభమైన సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్ (SATAT) కార్యక్రమం ముఖ్యమైన మలుపు. చమురు మార్కెటింగ్ సంస్థలు ఉత్పత్తిదారుల నుంచి సీబీజీ కొనుగోలు చేస్తామనే హామీ ఇవ్వడం దాని ప్రధాన ఆకర్షణ.
SATAT లక్ష్యాలు ఎంతో పెద్దవిగా ఉన్నప్పటికీ, వాస్తవ అమలు వేగం నిరాశపరిచింది. 2024 నవంబరు నాటికి 80 సీబీజీ ప్లాంట్లు మాత్రమే ప్రారంభమయ్యాయని అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది; వేలాది ప్లాంట్ల ఆశయం, కొద్ది దశాబ్దాల ప్లాంట్ల వాస్తవం మధ్య ఉన్న అంతరం భారత అమలు సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తుతుంది.
2024 ఫిబ్రవరి 2న పెట్రోలియం-సహజవాయు మంత్రిత్వ శాఖ, నగర గ్యాస్ పంపిణీ వ్యవస్థలో రవాణా సీఎన్‌జీ, గృహ పీఎన్‌జీ విభాగాలకు తప్పనిసరి సీబీజీ మిశ్రమ నిబంధనకు సంబంధించిన ప్రకటనను జారీ చేసింది. తొలుత 2025-26లో 1 శాతం, 2026-27లో 3 శాతం, 2027-28లో 4 శాతం, 2028-29 నుంచి 5 శాతం మిశ్రమ లక్ష్యాలను నిర్దేశించారు. తాజా గోబర్‌ధన్ పథకం 2026-27 నుంచి 2035-36 వరకు పదేళ్ల కాలానికి 23 వేల 731 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విధానాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తోంది. ఇది ఉత్పత్తి పెంపు, పెట్టుబడుల ఆకర్షణ, హామీ కొనుగోలు, ధర స్థిరత్వం, పైప్‌లైన్ అనుసంధానం, రుణ భరోసా, ముడిసరుకు నిర్వహణ వంటి అంశాలను ఏకీకృతం చేయాలనే ప్రయత్నం.
పథకంలో ప్రధాన బలం
గోబర్‌ధన్ పథకం గొప్పదనం సబ్సిడీ మొత్తంలో మాత్రమే లేదు; గత పథకాలలో విడివిడిగా ఉన్న కీలక సమస్యలను ఒకే విధాన చట్రంలో పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నంలో ఉంది. నగర గ్యాస్ పంపిణీ సంస్థలు నిర్దిష్ట మిశ్రమ లక్ష్యాలను చేరేందుకు సీబీజీ కొనుగోలు చేయాల్సి రావడం వల్ల ఉత్పత్తిదారుడికి మార్కెట్ ఉంటుందనే భరోసా పెరుగుతుంది. ప్రభుత్వ మద్దతుతో మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 2 వేల 110, అంటే కిలో సీబీజీకి 105 రూపాయల పరిపాలిత ధరను ప్రకటించడం పెట్టుబడిదారుల దృష్టిలో ముఖ్యమైన అంశం. ధరల అనిశ్చితి, కొనుగోలుదారుల కొరత వల్ల లాభదాయకత దెబ్బతిన్న రంగానికి ఇది ఒక రకమైన ఆదాయ భద్రతను అందించాలనే ప్రయత్నం. అర్హతగల కొత్త ప్లాంట్లకు రోజువారీ ఒక్క టన్ను ఉత్పత్తి సామర్థ్యానికి గరిష్ఠంగా 2 కోట్ల మూలధన సహాయం, ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులకు రుణంలో గరిష్ఠంగా 85 శాతం వరకు క్రెడిట్ గ్యారంటీ, పైప్‌లైన్ అనుసంధానానికి మద్దతు, ఫీడ్‌స్టాక్ మ్యాపింగ్‌కు ప్రత్యేక నిధి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం దశాబ్దంలో రోజుకు 5 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సీబీజీ ఉత్పత్తిని సాధించాలని, దానివల్ల సుమారు 10 మిలియన్ టన్నుల శిలాజ ఇంధన వినియోగాన్ని భర్తీ చేయవచ్చని అంచనా వేస్తోంది. ఇది 75 వేల కోట్ల రూపాయల ఎదగవచ్చన్నది ప్రభుత్వ అంచనా.
అసలు సంక్షోభం: ముడిసరుకు
సీబీజీ పరిశ్రమలో అత్యంత కఠినమైన ప్రశ్న ప్లాంటు నిర్మాణం కాదు; ప్రతిరోజూ పేడ, చెత్త, పంట వ్యర్థాన్ని సరైన పరిమాణంలో, తక్కువ ఖర్చుతో, స్థిర నాణ్యతతో ప్లాంటుకు చేర్చడం. ఒక ప్లాంటు రుణం తీసుకుని, యంత్రాలు కొనుగోలు చేసి నిర్మించడం సాధ్యమే; కాని సంవత్సరాలపాటు రోజువారీ ముడిసరుకు సరఫరా గొలుసును నిర్వహించడం క్లిష్టం.
పేడకు కిలోకు రూపాయి చెల్లిస్తామన్న నమూనా రైతుకు అదనపు ఆదాయ అవకాశాన్ని చూపుతుంది. కానీ పశుపోషక రైతు వద్ద ఉన్న పేడలో కొంత పొలానికి ఎరువుగా, కొంత ఇంటి వినియోగానికి, కొంత ఎండబెట్టి ఇంధనంగా వినియోగమవుతుంది. కాబట్టి మార్కెట్లో అందుబాటులోని పేడ పరిమాణాన్ని కాగితాలపై ఉన్న మొత్తం పశు సంఖ్యతో సమానం చేయడం తప్పుదారి పట్టించే లెక్క. రైతుకు సేకరణ ఖర్చు, దూరం, తేమ శాతం, చెల్లింపు సమయం, రవాణా సౌకర్యం అన్నీ ముఖ్యం.
పంట అవశేషాల విషయంలో సమస్య మరింత సున్నితమైనది. పొలంలో మిగిలే అవశేషాలను పూర్తిగా తీసుకుపోతే నేలలో సేంద్రియ కార్బన్, పోషకాలు తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వ్యర్థాలను కాల్చవద్దు; ప్లాంటుకు అమ్మండి అనడం సరిపోదు. నేల ఆరోగ్యం దెబ్బతినకుండా ఎంత అవశేషాన్ని తీసుకోవచ్చో శాస్త్రీయంగా నిర్ధారించడం, రైతుకు ప్రత్యామ్నాయ సేంద్రియ ఎరువు అందించడం, రవాణా ఖర్చులను భరించే వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరం.
సేంద్రియ ఎరువు ప్రశ్న
బయోగ్యాస్ తయారీ తర్వాత మిగిలే డైజెస్టేట్‌ను సేంద్రియ ఎరువుగా విక్రయించడం ఈ పరిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం. గ్యాస్ విక్రయ ఆదాయంతో మాత్రమే అనేక ప్లాంట్లు నిలబడలేవు. ఎరువు విక్రయం అదనపు ఆదాయం మాత్రమే కాదు, వ్యర్థాన్ని మళ్లీ వ్యవసాయానికి మళ్లించే సర్క్యులర్ ఎకానమీ సూత్రం కూడా. కానీ సేంద్రియ ఎరువు అనే లేబుల్ ఒక్కటే నాణ్యతకు హామీ కాదు. మునిసిపల్ చెత్తలో ప్లాస్టిక్, గాజు, భారలోహాలు, ఇతర మలినాలు కలిసే అవకాశం ఉంటుంది. మూలం వద్ద చెత్త వేరు చేయడం విఫలమైతే, డైజెస్టేట్‌లో కలుషితాలు ఉండే ప్రమాదం ఉంది. ఇలాంటి ఉత్పత్తి వ్యవసాయ భూమిలోకి వెళ్తే అది వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కాదు. వ్యర్థాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం మాత్రమే అవుతుంది.
అందుకే ఎరువు నాణ్యతకు స్వతంత్ర పరీక్షలు, బ్యాచ్‌ల వారీ ట్రేసబిలిటీ, భారలోహాల తనిఖీలు, రైతుకు పూర్తి సమాచారం, కాలుష్య నియంత్రణ సంస్థల సమర్థ పర్యవేక్షణ అవసరం. ప్లాంట్లను లెక్కపెట్టడం కంటే, ఎన్ని ప్లాంట్లు నిరంతరం ప్రమాణబద్ధమైన గ్యాస్, సురక్షితమైన ఎరువు ఇస్తున్నాయో లెక్కించడం ముఖ్యం.
బయో-సీఎన్‌జీ ప్లాంటు విజయాన్ని ప్రారంభోత్సవాల సంఖ్యతో కొలవకూడదు. ప్రకటించిన సామర్థ్యంలో వాస్తవంగా ఎంత ఉత్పత్తి అవుతోంది, గ్యాస్ నాణ్యత ఏమిటి, రైతుకు ఎంత చెల్లిస్తున్నారు, డైజెస్టేట్ పరీక్షలు జరిగాయా అనే ప్రశ్నలే అసలు కొలమానాలు.
న్యాయ, నియంత్రణ కోణం
సీబీజీ ప్లాంట్లకు శుభ్రమైన ఇంధనం అనే నినాదం ఉన్నా, చట్టపరమైన మినహాయింపు ఉండదు. ప్రాజెక్టు స్థలం, ముడిసరుకు స్వభావం, సామర్థ్యం, స్థానిక నిబంధనల ఆధారంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి స్థాపన అనుమతి, నిర్వహణ అనుమతి, భద్రతా అనుమతులు, భవన. ఫ్యాక్టరీ సంబంధిత అనుమతులు పొందాలి. కేంద్ర వ్యర్థాల నుంచి ఇంధన కార్యక్రమ మార్గదర్శకాల్లో కూడా కాలుష్య నియంత్రణ మండలి అనుమతిని పత్రాల్లో భాగంగా పేర్కొన్నారు.
ఇంధనంగా విక్రయించే గ్యాస్‌కు నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి. సీబీజీ సరఫరా, పరీక్షలు, గ్యాస్ కంప్రెషన్, నిల్వ, రవాణా, పైప్‌లైన్ ఇంజెక్షన్ వంటి కార్యకలాపాల్లో సాంకేతిక, అగ్ని భద్రత, పీడన పాత్రల ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. అందుకే ఉత్పత్తి కేంద్రం నుంచి సీఎన్‌జీ పంపు వరకు ఇది కేవలం వ్యవసాయ ప్రాజెక్టు కాదు.. గ్యాస్ పరిశ్రమకు సంబంధించిన కఠినమైన నాణ్యతా-భద్రతా వ్యవస్థ. తప్పనిసరి మిశ్రమ లక్ష్యం కూడా కేవలం రాజకీయ ప్రకటన కాదు. నగర గ్యాస్ పంపిణీ సంస్థల కొనుగోలు ద్వారా ఈ లక్ష్యాలను సాధించాలని అధికారికంగా నిర్దేశించారు. అయితే అందుబాటులో సరిపడా సీబీజీ లేకపోతే, గ్యాస్ నాణ్యత స్థిరంగా లేకపోతే, లేదా పైప్‌లైన్ అనుసంధానం ఆలస్యం అయితే, ఆ బాధ్యతను కేవలం పంపిణీ సంస్థలపై మోపడం వాస్తవానికి విరుద్ధం అవుతుంది.
రాజకీయ భాష, ఆర్థిక వాస్తవం
గోబర్ అనే పదానికి భారత రాజకీయ, సాంస్కృతిక భాషలో ఒక ప్రత్యేకత ఉంది. పశుసంపద, గ్రామీణ జీవనం, స్వదేశీ ఆర్థికత, ఆవు కేంద్రిత భావజాలం వంటి ప్రతీకలతో దీనిని ముడిపెట్టడం సులభం. కానీ ఒక ఆధునిక సీబీజీ విధానాన్ని మత, సాంస్కృతిక ప్రచారంతో కొలవడం దాని ప్రయోజనాన్ని చిన్నబుచ్చడమే.
ఈ పథకానికి నిజమైన విలువ పేడలో కాదు; వ్యర్థానికి కొలిచే ధరను, సరఫరా గొలుసును, పరిశ్రమను, కొనుగోలుదారుని, పర్యావరణ జవాబుదారీతనాన్ని కలిపే ఆర్థిక నిర్మాణంలో ఉంది. పేడతోనే సీబీజీ రంగం నిలబడదు. పంట అవశేషాలు, ప్రెస్‌మడ్, ఆహార వ్యర్థాలు, మునిసిపల్ సేంద్రియ చెత్త, డెయిరీ వ్యర్థాలు వంటి విభిన్న ముడిసరుకులను ప్రాంతీయంగా సమీకరించగలిగితేనే పరిశ్రమ స్థిరపడుతుంది. పథకం ప్రకటించగానే వాహన తయారీదారులకు లాభమనే ప్రచారం కూడా కొంత అతిశయోక్తి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్, టయోటా వంటి సంస్థల సీఎన్‌జీ వాహన వినియోగదారులకు ఇంధన సరఫరా విస్తరించడం సానుకూలమే. కానీ 5 శాతం మిశ్రమం అంటే 95 శాతం సరఫరా ఇప్పటికీ సంప్రదాయ సహజవాయువే. ఇది సీఎన్‌జీని పూర్తిగా పునరుత్పాదక ఇంధనంగా మార్చే విప్లవం కాదు; శిలాజ సహజవాయువుకు పునరుత్పాదక భాగాన్ని జోడించే ప్రారంభ దశ మాత్రమే.
సీబీజీపై మీడియా కథనాలు సాధారణంగా మూడు సులభమైన చిత్రాలను చూపుతాయి: పేడతో కారు నడుస్తుంది; రైతుకు డబ్బు వస్తుంది; కాలుష్యం తగ్గుతుంది. ఈ మూడు వాక్యాల్లో నిజం ఉంది. కానీ పూర్తి నిజం కాదు. పేడ సేకరణ కోసం గ్రామస్థాయిలో నిల్వ కేంద్రాలు, తూకం పరికరాలు, డిజిటల్ చెల్లింపులు, పారదర్శక ధరలు, రవాణా వాహనాలు, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం వంటి నిర్మాణాలు అవసరం. రైతుకు చెల్లింపు ఆలస్యమైతే లేదా కొనుగోలు ధర ఖర్చుకు సరిపోకపోతే, సేకరణ వ్యవస్థ కూలిపోతుంది. ప్లాంటుకు డబ్బు ఇవ్వడం కంటే, గ్రామీణ ముడిసరుకు మార్కెట్‌ను నమ్మదగినదిగా చేయడం చాలా పెద్ద బాధ్యత.
అలాగే మునిసిపల్ వ్యర్థాల వినియోగం విషయంలో స్థానిక సంస్థల బాధ్యతను విస్మరించలేం. ఇంటి వద్దే తడి-పొడి చెత్త వేరు చేయని నగరం, మిశ్రమ చెత్తను బయో-సీఎన్‌జీ ప్లాంటుకు పంపి అద్భుత ఫలితం ఆశించడం శాస్త్రీయం కాదు. వ్యర్థాల వేర్పాటు, ప్లాస్టిక్ నియంత్రణ, మునిసిపల్ ఒప్పందాల్లో పారదర్శకత, కాలుష్య పర్యవేక్షణ, స్థానికుల ఫిర్యాదుల పరిష్కారం లేకుంటే “వేస్ట్ టు వెల్త్” నినాదం కాంట్రాక్టర్లకు మాత్రమే లాభదాయకం అయ్యే ప్రమాదం ఉంది.
ప్రజా ప్రయోజనం ఎలా?
ఈ పథకం సమర్థంగా పనిచేస్తే, పంట అవశేషాల దహనం తగ్గడం ద్వారా వాయు కాలుష్యాన్ని కొంత మేర తగ్గించవచ్చు; బహిరంగంగా కుళ్లే పేడ, సేంద్రియ వ్యర్థాల నుంచి విడుదలయ్యే మీథేన్‌ను వినియోగంలోకి తేవచ్చు; గ్రామీణ ప్రాంతాల్లో అదనపు ఉపాధి, ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. సీబీజీ ఉత్పత్తి పెరిగితే దిగుమతి సహజవాయువుపై ఆధారాన్ని కొంత తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రజా ప్రయోజనం పథకం ఖర్చు, సబ్సిడీ, ఉత్పత్తి, కొనుగోలు, రైతు చెల్లింపులు, ఎరువు నాణ్యత, ఉద్గారాలు వంటి అన్ని సమాచారాన్ని బహిరంగంగా ఉంచినప్పుడే స్పష్టమవుతుంది. ప్రతి జిల్లాలో ఎన్ని ప్లాంట్లు ఆమోదమయ్యాయి, ఎన్ని ప్రారంభమయ్యాయి, ఎన్ని పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి, రోజువారీ గ్యాస్ ఉత్పత్తి ఎంత, ఎన్ని రైతులకు చెల్లింపులు జరిగాయి అనే సమాచారానికి ప్రజలకు సులభ ప్రాప్తి ఉండాలి. ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాల కంటే, స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ మరింత అవసరం. వార్షిక ఆడిట్‌లో సబ్సిడీ వినియోగం, రుణ గ్యారంటీ ప్రయోజనం, మిశ్రమ లక్ష్యాల అమలు, భద్రతా సంఘటనలు, మీథేన్ లీకేజీలు, రైతుల ఆదాయం, డైజెస్టేట్ నాణ్యత వంటి సూచికలు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే “హరిత ఇంధన” పథకం అనే పేరుతో ప్రజాధనం, బ్యాంకు రుణాలు, సహజ వనరులు అసమర్థ ప్రాజెక్టుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.
గోబర్‌ధన్ పథకాన్ని తిరస్కరించడం విజ్ఞానం కాదు. అలాగే దానిని భారత ఇంధన స్వావలంబనకు తక్షణ పరిష్కారమని చెప్పడం కూడా నిజాయితీ కాదు. 23 వేల 731 కోట్లతో ప్రభుత్వం సరైన సమస్యలను గుర్తించింది: మార్కెట్ లేకపోవడం, ధర అనిశ్చితి, పెట్టుబడి కొరత, పైప్‌లైన్ లేమి, ముడిసరుకు నిర్వహణ లోపం.
సరైన సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం రెండూ వేర్వేరు విషయాలు. SATAT కాలంలో భారీ లక్ష్యాలకు ఎదురైన మందగమనాన్ని ప్రభుత్వం బహిరంగంగా విశ్లేషించి, ప్రతి వైఫల్యానికి సంస్థాగత పరిష్కారం నిర్మించాలి. ప్లాంట్ల ప్రారంభోత్సవాలు కాదు; నిరంతర ఉత్పత్తి, పారదర్శక కొనుగోలు, రైతు ఆదాయం, కాలుష్య నియంత్రణ, నాణ్యత గల సేంద్రియ ఎరువు, ప్రజలకు అందుబాటులో ఉన్న లెక్కలు. ఇవే గోబర్‌ధన్ విజయానికి అసలు ప్రమాణాలు.
భారత్‌కు బయో సీఎన్‌జీ అవసరం ఉంది. కానీ ప్రచారానికి కాదు, శాస్త్రీయంగా నిర్వహించే వికేంద్రీకృత స్వచ్ఛ ఇంధన వ్యవస్థగా. పేడను పవిత్ర ప్రతీకగా కాకుండా, విలువైన ముడిసరకుగా; రైతును ఓటరుగా కాకుండా, సరఫరా గొలుసులో సమాన భాగస్వామిగా; పథకాన్ని ప్రకటనగా కాకుండా, ప్రజా జవాబుదారీతనానికి లోబడిన దీర్ఘకాలిక ఇంధన విధానంగా చూసినప్పుడే ఈ ప్రయోగం నిజమైన అర్థంలో విజయం సాధిస్తుంది.
- సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
Gobardhan Scheme 2026, Compressed Biogas India, Bio CNG, GOBARdhan Cabinet Approval, Rural Economy Energy






