కొండ నాలుక్కి మందేస్తే..

posted on: Nov 8, 2014 11:05AM

 

కొండ నాలుక్కి మందేస్తే.. ఉన్న నాలుక కూడా ఊడిందన్నట్లుంది గోవాలో బీజేపీ పరిస్థితి ఇప్పుడు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రికర్ ను కేంద్రమంత్రి పదవి చేప్పట్టమని ప్రధాని మోడీ కోరడంతో, ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ మంత్రిగా చేస్తున్నలక్ష్మీకాంత్ పర్శేఖర్ లేదా స్పీకర్ గా వ్యవహరిస్తున్న రాజేంద అర్లేఖర్ లలో ఎవరినో ఒకరిని తన స్థానంలో ముఖ్యమంత్రిగా నియమించాలని పర్రికర్ చేసిన ప్రతిపాదనకు బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగానే స్పందించింది.

 

కానీ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న డిసౌజా ఆ పదవి తనకే ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. మొత్తం 21మంది శాసనసభ్యులలో 10మంది తనకే మద్దతు ఇస్తున్నారు కనుక తనకే తప్పనిసరిగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. పదిమందిలో తొమ్మిదిమంది ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. కనుక ముఖ్యమంత్రి పదవి విషయంలో ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఈరోజు సాయంత్రం 4గంటలకి గోవాలో పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఆలోగా ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు బీజేపీ అధిష్టానం గట్టిగా కృషి చేస్తోంది. అందుకోసం డిల్లీ నుండి కేంద్ర పరిశీలకుడిగా గోవా వచ్చిన రాజీవ్ రూడీ ప్రస్తుతం అసమ్మతి వర్గంతో చర్చలు జరుపుతున్నారు.

 

నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలిచి, రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కెతోలిక్ క్రీష్టియన్లను పార్టీ వైపు ఆకర్షించి బీజేపీకి అధికారం దక్కేలా చేసిన తనను కాదని వేరొకరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే తాను, తనకు మద్దతు ఇస్తున్న 10మంది శాసనసభ్యులు తిరుగుబాటు చేస్తామని డిసౌజా కుండబ్రద్దలు కొట్టినట్లుగా తెగేసి చెపుతున్నారు. మరి బీజేపీ ఈ ఒత్తిళ్లకు లొంగి ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి రాష్ట్రంలో పార్టీని బ్రతికించుకొంటుoదా? లేక ఆయనను బ్రతిమాలుకోనో లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటానని బెదిరించి తనకు నచ్చిన వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుందో ఈ సాయంత్రంలోగా తేలిపోతుంది.

 

గోవాలో అధికారం కోల్పోవడానికి బీజేపీ ఇష్టపడదు కనుక డిసౌజాకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును. లేదా ఆయనకు ఏదో ఒకగట్టి హామీనిచ్చి ప్రస్తుతానికి శాంతింపజేయవచ్చును. పర్రికర్ కి కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోయే పరిస్థితి దాపురించడం విడ్డూరంగానే ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...