రుషికొండ ప్యాలెస్ కు గ్లోబల్ టెండర్.!

posted on: Jul 3, 2026 1:37PM

విశాఖపట్నంలోని అత్యంత వివాదాస్పద  రుషికొండ ప్యాలెస్ విషయంలో   ఎట్టకేలకు ఒక  నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో చారిత్రాత్మక రుషికొండకు బోడిగుండు కొట్టి, పర్యావరణ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి  మరీ..  500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో  నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న విషయంలో గత రెండేళ్లుగా మల్లగుల్లాలు పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని  ఏర్పాటు చేసింది.

ఈ మంత్రుల కమిటీ పలుమార్లు సమావేశమై, వివిధ ప్రత్యామ్నాయాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. ఈ ప్యాలెస్‌ను అంతర్జాతీయ స్థాయి సంస్థలకు లీజుకు ఇవ్వడమే ప్రభుత్వానికి లాభదాయకమని తుది నిర్ణయానికి వచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు మేరకు  ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రుషికొండ ప్యాలెస్ తో  పాటు దానికి ఆనుకుని ఉన్న   9 ఎకరాల అదనపు భూమిని లీజు, ఆపరేషన్, మేనేజ్మెంట్, అభివృద్ధి కోసం అధికారికంగా అంతర్జాతీయ స్థాయి  గ్లోబల్ టెండర్  నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

ఈ టెండర్ల దాఖలుకు ఈ నెల 10 తుది గడువుగా నిర్ణయించింది.  రుషికొండ ప్యాలెస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లగ్జరీ రిసార్ట్ లేదా, ఫైవ్ స్టార్ హోటల్‌గా మార్చాలని ఏపీ టూరిజంభావిస్తోంది.  గతంలో ఈ కొండపై ఉన్న టూరిజం రిసార్ట్స్ ద్వారా ఏడాదికి   ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించేది.   గత ప్రభుత్వం వాటిని తొలగించి ఈ భారీ ప్యాలెస్‌ను నిర్మించింది. అప్పటి నుంచి ఆదాయం లేకపోగా, ఈ ప్యాలెస్ మెయింటేనెన్స్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. 

ఈ నేపథ్యంలోనే రుషికొండ ప్యాలెస్ ను  పర్యాటక రంగంలో సరికొత్త గ్లోబల్ ఐకాన్‌గా తీర్చిదిద్దడం ద్వారా అటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతో పాటు, వైజాగ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ టెండర్ ప్రకటనతో గత కొద్ది రోజులుగా రుషికొండ భవనాల భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలికినట్లైంది.   

google-ad-img
    Related Sigment News
    • Loading...