ఇండియా గ్లోబల్ గ్రోత్ ఇంజిన్

posted on: Apr 15, 2026 2:44PM

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ తన పటిష్టతను చాటుకుంటోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న అశాంతి, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో  గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అయితే భారత్ మాత్రం స్థిరమైన వృద్ధి సాధిస్తోంది. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి   విడుదల చేసిన నివేదికలో భారత్ రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది. ఇండియా వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 6.5 శాతానికి పెంచుతూ ఐఎంఎఫ్ సానుకూల నిర్ణయం తీసుకోవడం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతను చాటుతోంది.

ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం, 2027,  2028 ఆర్థిక సంవత్సరాలకు గాను భారతదేశ జీడీపీ 6.5 శాతం స్థాయిలో నమోదు కానుంది. ప్రపంచంలోని ఇతర దిగ్గజ దేశాలతో పోలిస్తే ఇది అధికం. ముఖ్యంగా   చైనా 4.4 శాతం వృద్ధికే పరిమితం అవుతుందని, అగ్రరాజ్యం అమెరికా సైతం 2.3 శాతం వృద్ధికి మాత్రమే పరిమితమౌతుందని ఐఎంఎఫ్ నివేదిక అంచనా వేసింది.  రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి ఐరోపా దేశాలు ఒక శాతం వృద్ధికి కూడా కష్టపడుతున్న స్థితిలో ఇండియా ఏకంగా 6.5శాతం వృద్ధితో  అగ్రస్థానంలో నిలవడం విశేషం. అయితే భారత్ పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక గమనంపై ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. 2026 సంవత్సరానికి   గ్లోబల్ వృద్ధి అంచనాలను గతంలో ఉన్న 3.3 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గించింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణలే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది.

ప్రధానంగా  ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం, దాడులు, ప్రతిదాడులు చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. ఒకవేళ ఈ యుద్ధ పరిస్థితులు లేకపోయి ఉంటే ప్రపంచ వృద్ధి రేటు 3.4 శాతానికి చేరుకునేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.  ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముకగా భావించే  హార్ముజ్ జలసంధి వద్ద తలెత్తుతున్న రవాణా ఆటంకాలు ఇంధన ధరలను పెంచుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ మార్గం నుండే సాగుతుండగా, ఇరాన్ ఆంక్షలు, అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాలు గ్లోబల్ మార్కెట్లను అస్థిరపరుస్తున్నాయి. దీనివల్ల కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా ఎరువుల ధరలు కూడా ఆకాశానికి ఎగసి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది.  

ప్రస్తుత ఏడాదిలో గ్లోబల్  ద్రవ్యోల్బణం 4.4 శాతానికి చేరుతుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది.  పరిస్థితులు మరింత దిగజారి ఇంధన ధరలు గనుక ఏడాది పొడవునా గరిష్టంగా ఉంటే..  ప్రపంచ వృద్ధి రేటు 2 శాతానికి పడిపోయే ప్రమాదం  లేకపోలేదని అంచనా వేసింది. గతంలో 2008 నాటి ఆర్థిక మాంద్యం, ఆ తరువాత కోవిడ్-19 సమయంలో మాత్రమే వృద్ధిరేటి ఈ స్థాయి  కనిష్టానికి చేరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో   భారత్ తన వృద్ధిని నిలబెట్టుకోవడానికి అమెరికా సుంకాల తగ్గింపు వంటి అంశాలు తోడ్పడనున్నాయి. ఇది భారత ఎగుమతులను ప్రోత్సహించి మన దేశం  గ్లోబల్ గ్రోత్ ఇంజిన్ గా కొనసాగడానికి సహాయపడుతుంది.

 మొత్తానికి..  అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్ ప్రదర్శిస్తున్న ఆర్థిక స్థిరత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.  చైనా వంటి దేశాలు ఎగుమతులపై అధికంగా ఆధారపడుతూ దేశీయ డిమాండ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఇండియా మాత్రం దూసుకుపోతోంది. రాబోయే రెండేళ్లలో కూడా ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్  బలమైన శక్తిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటుందని ఐఎంఎఫ్ అంచనాలు చెబుతున్నాయి.

- సీతారాం కంఠమనేని

google-ad-img
    Related Sigment News
    • Loading...