ప్రపంచ ఆర్థిక వేదికపై భారత్ సరికొత్త అధ్యాయం.. గిఫ్ట్ సిటీ.!

posted on: Jul 20, 2026 9:16AM

ఇండియా ఆర్థిక చరిత్రలో గుజరాత్‌లోని గాంధీనగర్ సమీపంలో నిర్మించిన  గిఫ్ట్ సిటీ  (గుజరాత్ ఇంటర్నేషనల్  ఫైనాన్స్ టెక్ సిటీ) ఒక మేలి మలుపుగా నిలుస్తోంది. దశాబ్దాలుగా  బహుళజాతి సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు తమ గ్లోబల్ క్యాష్ మేనేజ్మెంట్, ఫారెక్స్ లావాదేవీలు, డాలర్ బాండ్ల జారీ కోసం దూబాయ్, సింగపూర్ లేదా లండన్ వంటి సెంటర్లపైనే ఆధారపడేవారు. విదేశీ కరెన్సీలో ఫండింగ్ పొందాలన్నా, అంతర్జాతీయ స్థాయి బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించాలన్నా దేశ సరిహద్దులు దాటక తప్పని పరిస్థితి ఉండేది. అయితే..   ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేసి, భారత భూభాగంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే ఆశయంతో ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్‌ను రూపుదిద్దారు. ఇప్పుడు ప్రపంచ దిగ్గజ ఆర్థిక సంస్థలను ఆకర్షిస్తూ దూబాయ్, సింగపూర్ వంటి సెంటర్లకు గిఫ్ట్ సిటీ సవాలు విసురుతోంది. 

  గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్‌లో అతిపెద్ద శక్తిగా ఉన్న జెపి మోర్గాన్ చేజ్ అండ్ కో విడుదల చేసిన వివరాలు ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో  చర్చనీయాంశమయ్యాయి. రాబోయే 12 నుండి 18 నెలల్లో గిఫ్ట్ సిటీ వేదికగా తమ కార్పొరేట్ ట్రెజరీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు   వందకు పైగా అంతర్జాతీయ సంస్థలు తమను సంప్రదించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు మరే ఇతర ఆసియా ఆర్థిక కేంద్రంలోనూ ఈ స్థాయిలో స్వల్ప కాలంలో ఆసక్తి కనిపింకపోవడం గమనార్హం. ఇందులో ఇన్సూరెన్స్, టెక్నాలజీ, ఫిన్‌టెక్, తయారీ రంగాలకు చెందిన బహుళజాతి సంస్థలు ఉన్నాయి.  ప్రస్తుతం గిఫ్ట్ సిటీలో డజనుకు పైగా కార్పొరేట్ ట్రెజరీ కేంద్రాలు పనిచేస్తుండగా.. త్వరలోనే మరిన్ని అంతర్జాతీయ గ్రూపులు తమ కేంద్రాలను ఇక్కడ నెలకొల్పడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వెయ్యికి పైగా నమోదిత సంస్థలు, పదుల సంఖ్యలో అంతర్జాతీయ బ్యాంకులు, వందలాది ఫండ్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఇక్కడి నుండి తమ సేవలను అందిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ వంటి దేశీయ దిగ్గజాలు కూడా తమ విదేశీ కేంద్రాల కార్యకలాపాలను ఇక్కడికి తరలించడం దీని ప్రాధాన్యతను నిరూపిస్తోంది. 

 100 బిలియన్ డాలర్ల మైలురాయి దాటిన బ్యాంకింగ్ ఆస్తులు గిఫ్ట్ సిటీ నమోదు చేస్తున్న వృద్ధి గణాంకాలు అంతర్జాతీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ కేంద్రంలోని బ్యాంకింగ్ ఆస్తుల విలువ ఏకంగా 100 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే బ్యాంకింగ్ ఆస్తులు రెట్టింపు కావడం ఇక్కడి వ్యాపార వేగానికి అద్దం పడుతోంది. వార్షికంగా 40 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేస్తూ, విదేశీ వాణిజ్య రుణాలు, ఫండ్ మేనేజ్‌మెంట్ కమిట్‌మెంట్లలో బిలియన్ల డాలర్లను ఆకర్షిస్తోంది.  గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో గిఫ్ట్ సిటీ నిలకడగా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తోంది. దేశీయ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు ప్రపంచ స్థాయి నగరాలకు పోటీగా నిలుస్తూ అంతర్జాతీయ రేటింగ్‌లలో వేగంగా ముందుకు సాగుతోంది.


 గిఫ్ట్ సిటీ పురోగతి ముఖ్యాంశాలు..          
 
  బ్యాంకింగ్ ఆస్తులు:  100+ బిలియన్ డాలర్లు      
 సంప్రదించిన బహుళజాతి కంపెనీలు..  100 ప్లస్   
  నమోదిత సంస్థలు..  1150 పైచిలుకు  
 పనిచేస్తున్న బ్యాంకులు..  30కి పైగా                    
  ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థలు.. 200 పైచిలుకు 
     

సులభతర వ్యాపార విధానం మరియు ఏకీకృత నిబంధనలుఒకే ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ అమలు చేస్తున్న సరళీకృత నియంత్రణల విధానమే. గతంలో బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, ఇన్సూరెన్స్ రంగాలకు వేర్వేరు నిబంధనలు,   నియంత్రణ సంస్థలు ఉండటం వల్ల ప్రక్రియ ఆలస్యమయ్యేది. కానీ..  ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ఏకీకృత నియంత్రణ మండలి  ఐఎఫ్ఎస్సీఏ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనుమతుల ప్రక్రియ  వేగవంతమైంది.  దీనికి తోడు, గిఫ్ట్ సిటీని ప్రత్యేక ఆర్థిక పరిధిగా పరిగణిస్తూ, విదేశీ మారక ద్రవ్య నిబంధనల   నుండి అనుకూలమైన మినహాయింపులు కల్పించారు. విదేశీ కరెన్సీ ఖాతాల నిర్వహణ, లిక్విడిటీ పూలింగ్, క్యాష్ కాన్సంట్రేషన్ వంటి అధునాతన ఆర్థిక సేవలను ఇక్కడి నుండే సులభంగా నిర్వహించే వెసులుబాటు లభించింది. ఇది కేవలం పన్ను మినహాయింపుల కేంద్రంగా మాత్రమే గాక, వ్యాపార నిర్వహణను అత్యంత సులభతరం చేసే పూర్తిస్థాయి ఆర్కిటెక్చర్‌గా రూపాంతరం చెందింది.  పన్ను మినహాయింపులు,  ఆర్థిక ప్రోత్సాహకాలు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో ఇక్కడ లభిస్తున్న పన్ను మినహాయింపులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

గిఫ్ట్ సిటీలో యూనిట్లను నెలకొల్పే సంస్థలకు నిర్ణీత కాలానికి 100 శాతం పన్ను మినహాయింపులతో పాటు సుదీర్ఘ పన్ను హాలిడే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపులు, సింగిల్ విండో డిజిటల్ సిస్టమ్ ద్వారా వేగవంతమైన అనుమతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.  ఈ ప్రత్యేక నిబంధనల వల్ల భారతీయ స్టార్టప్‌లు, కార్పొరేట్ సంస్థలు విదేశీ మార్కెట్లకు వెళ్లకుండానే గిఫ్ట్ సిటీ వేదికగా నేరుగా గ్లోబల్ క్యాపిటల్‌ను సమీకరించుకునే అవకాశం ఏర్పడింది. ఇది దేశీయ రంగానికి గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానాన్ని పెంచుతోంది. 

దేశ  ఆర్థిక రాజధాని ముంబై ఉండగా గిఫ్ట్ సిటీ ప్రాధాన్యత ఏమిటనే దానిపై అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముంబై అనేది ప్రధానంగా దేశీయ కరెన్సీ,  ఆన్‌షోర్ మార్కెట్ లావాదేవీలకు కేంద్రం. కానీ గిఫ్ట్ సిటీ అనేది విదేశీ కరెన్సీ   లావాదేవీల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆఫ్ షోర్ తరహా ఆన్ షోర్ కేంద్రం.  కాబట్టి, ఈ రెండు కేంద్రాలు ఒకదానికొకటి పోటీ కావు, ఒకదానికొకటి పూరకంగా పనిచేస్తాయి. ముంబై దేశీయ ఆర్థిక లావాదేవీలను చూసుకుంటే, గిఫ్ట్ సిటీ సరిహద్దులు దాటే అంతర్జాతీయ నిధుల ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లోని ఐటీ, తయారీ, సేవా రంగాలు తమ గ్లోబల్ ఆపరేషన్స్ కోసం ఈ హబ్‌ను ఒక గేట్‌వేలా ఉపయోగించుకోవచ్చు


  ముంబై,  గిఫ్ట్ సిటీల పోలిక                      
 
  అంశం                         | ముంబై                                  గిఫ్ట్ సిటీ         
 ------------------- -------------------------  
  ప్రాథమిక దృష్టి    | ఆన్‌షోర్ / దేశీయ మార్కెట్  | ఆఫ్‌షోర్ / గ్లోబల్ మార్కెట్ |
  ప్రధాన కరెన్సీ    | భారతీయ రూపాయి (INR)     | విదేశీ కరెన్సీలు (USD/EUR)  
  నియంత్రణ వ్యవస్థ  | RBI, SEBI, IRDAI (వేర్వేరు)| IFSCA (ఏకీకృత మండలి)   
 ప్రధాన ప్రయోజనం   | దేశీయ పెట్టుబడులు       | అంతర్జాతీయ నిధుల సమీకరణ 
 --------------------------------------------------------- 

బ్యాంకింగ్, ఫైనాన్స్ రౌండ్లలో వేగంగా పురోగతి సాధిస్తున్నప్పటికీ, దూబాయ్ లేదా సింగపూర్ స్థాయిని పూర్తిగా అందుకోవడానికి గిఫ్ట్ సిటీ ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేయాల్సి ఉంది. ఆసియాలోని ఇతర ప్రధాన ఫైనాన్షియల్ హబ్‌లలో వందల బిలియన్ డాలర్ల మేర కార్యకలాపాలు సాగుతుండగా, గిఫ్ట్ సిటీ ఆ దిశగా   ప్రయాణిస్తోంది.  కేవలం ఆర్థిక సేవలు మాత్రమే కాకుండా, అక్కడ పనిచేసే నిపుణుల కోసం జీవన ప్రమాణాలు, సామాజిక మౌలిక వసతులు, నివాస గృహాల నిర్మాణం, రవాణా సౌకర్యాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.  మెట్రో విస్తరణ, వినోద రంగాలు, నివాస సముదాయాల నిర్మాణం ప్రస్తుతం వేగవంతంగా జరుగుతున్నప్పటికీ, అవి పూర్తిస్థాయికి చేరినప్పుడే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను శాశ్వతంగా ఆకర్షించడం సాధ్యమవుతుంది.

ఇండియా రాబోయే దశాబ్దాల్లో గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్‌గా మారే దిశగా పయనిస్తున్న నేపథ్యంలో గిఫ్ట్ సిటీ ప్రాధాన్యత   పెరగనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరుగుతున్న కొద్దీ, విదేశీ వాణిజ్యం,  మూలధన ప్రవాహాలను సురక్షితంగా నిర్వహించేందుకు సొంత అంతర్జాతీయ ఫైనాన్షియల్ సెంటర్ ఉండటం ఎంతో అవసరం.  ఒకప్పుడు రూపాయి,  డాలర్ లావాదేవీల కోసం విదేశీ నగరాల వైపు చూసిన భారతీయ కంపెనీలు, నేడు దేశీయంగా ఉన్న సదుపాయాలను వినియోగించుకుంటున్నాయి. అంతర్జాతీయ దిగ్గజాలు కూడా భారత్‌లోని గిఫ్ట్ సిటీ వేదికగా కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు రావడం అనేది 'భారత్ నుండి ప్రపంచానికి (ఫ్రం ఇండియా టు వరల్డ్ ) అనే నినాదానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.  

GIFT City India, JPMorgan GIFT City, IFSCA Banking Assets, Gujarat International Finance Tec City, Global Treasury Hub India

google-ad-img
    Related Sigment News
    • Loading...