మార్కెట్ ను శాసిస్తున్న జెన్ జీ!

posted on: Mar 17, 2026 11:20AM

భారత వినియోగదారుల మార్కెట్‌లో సరికొత్త శకం ఆరంభమైనట్లేనని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇకపై భారత మార్కెట్ ను శాసించేది జన్ జీ యు అని చెబుతున్నారు. ఇంతకీ ఈ జెన్ జీ ఏమిటి అన్న అనుమానం వచ్చిందా? ఆగండి అక్కడికే వస్తున్నా.. . 1990 నుంచి 2010  మధ్యలో జన్మించిన వారిని జెన్ జీ అంటారు. అంటే యువత.  ఆ యువతే ఇక  రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు చోదశక్తిగా మారనుంది. 2030 నాటికి అంటే రానున్న నాలుగేళ్లలో ఈ యువత వినియోగం  120 లక్షల కోట్ల రూపాయలకు.. డాలర్లలో చెప్పాలంటే.. దాదాపు 1.6 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్నది అంచనా.  అంతే కాదు జెన్ జీ రానున్న రోజులలో మార్కెట్ ధోరణులను కూడా మార్చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ యువత ఆలోచనా విధానం గత తరాల కంటే భిన్నంగా ఉందనీ,  వీరు   ప్రసిద్ధ బ్రాండ్ల కంటే తమకు కావలసిన వస్తువుల ప్రామాణికత, అవి తమకు ఇచ్చే సౌలభ్యం, అనుభవం, అనుభూతి వంటి వాటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.  ప్రధానంగా   బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ (బీపీసీ) రంగంపై వీరు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం బీపీసీ రంగంలో జెన్ జీల వాటా  1.75లక్షల కోట్లు ఉంటుంది.  బీపీసీ రంగంపై మహిళతో సమానంగా పురుషులూ ఆసక్తి చూపుతున్నారు.  గత అర్ధ దశాబ్దంలో  పురుషుల సౌందర్య ఉత్పత్తుల కోసం సెర్చ్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల రమారమి 850శాతం వరకూ ఉంది.  

అలాగే ఫ్యాషన్ రంగంపై కూడా జెన్ జీ ప్రభావం మెండుగా ఉంది.  మరీ ప్రియం లేకుండా  లభించే స్టైలిష్ దుస్తులు, పాదరక్షలకు యువత పెద్ద పీట వేస్తోంది. ఇక ఆ తరువాత ఫిట్‌నెస్, స్పోర్ట్స్ వేర్ రంగాల్లోనూ ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.  యువత తమ సంపాదనలో తక్కువలో తక్కువ 20 శాతం వరకూ హెల్త్ , స్పోర్ట్స్ సంబంధిత అవసరాలకే కేటాయిస్తున్నారని ఒక బిజినెట్ రిపోర్ట్ పేర్కొంది.  

జెన్ జీ ఆసక్తులకు అనుగుణంగానే ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లు తమ వ్యాపార వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి.  యువతను ఆకర్షించడమే లక్ష్యంగా  వారికి నచ్చే ప్రత్యేక ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక జెన్ జీపై సామాజిక మాధ్యమ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో  సంస్థలు తమ మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.  

ఇక రానున్న నాలుగైదేళ్ల కాలంలో  భారత మార్కెట్ విస్తరణలో జెన్-జీ  మరింత ప్రాముఖ్యత, ప్రాధాన్యత సంతరించుకోనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రిటైల్ రంగం నుండి టెక్నాలజీ వరకు ప్రతి రంగం ఈ కొత్త తరం అవసరాలకు అనుగుణంగా మారడం తధ్యమని అంటున్నారు.  మారుతున్న యువత  అభిరుచులే రేపటి భారత ఆర్థిక విజయానికి పునాదులౌతాయని అంటున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...