పాకిస్థాన్ లో పరాకాష్టకు చేరిన గ్యాస్ కొరత.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సామాన్యులు

posted on: Apr 30, 2026 3:32PM

పాకిస్థాన్‌లో ఆర్థిక పరిస్థితులు,  అంతర్జాతీయ పరిణామాలు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం పాకిస్థాన్ లో  వంటగ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడానికి కారణమైంది. గ్యాస్ కొరత తీవ్రం కావడంతో ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి వింతైన, అత్యంత ప్రమాదకరమైన పద్ధతుల్లో ఇంధనాన్ని నిల్వ చేసుకుంటున్నారు.

కరాచీ వంటి ప్రధాన నగరాల్లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. దీంతో స్థానికులు భారీ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ బెలూన్లను  అంటే సంచులను ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు.   గ్యాస్ సరఫరా చేసే ప్రధాన పైపుల నుంచి ఈ బెలూన్లలోకి నేరుగా గ్యాస్‌ను నింపుతున్నారు. చిన్నపాటి లీకేజీ లేదా నిప్పు రవ్వ తగిలినా క్షణాల్లో పేలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ..  గత్యంతరం లేని స్థితిలో ప్రజలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.

ఈ ప్లాస్టిక్ బెలూన్లను నిపుణులు  మొబైల్ బాంబులుగా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్లు అధిక పీడనాన్ని తట్టుకునేలా లోహంతో తయారవుతాయి. కానీ, పలచని ప్లాస్టిక్ కవర్లలో గ్యాస్‌ను నిల్వ చేయడం వల్ల అవి ఏ క్షణమైనా పేలిపోయే అవకాశం ఉంటుంది. రద్దీగా ఉండే నివాస ప్రాంతాల్లో ఇటువంటి చర్యలు పెను ప్రమాదాలకు దారితీస్తాయి. చిన్న ప్రమాదం జరిగినా.. వందలాది మంది ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంది. అయితే  భద్రతా నిపుణులు హెచ్చరికలను పెడచెవిన పెట్టి మరీ పాకిస్థానీయులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మరీ గ్యాస్ నిల్వ కోసం ప్లాస్టిక్ బెలూన్లను వాడుతున్నారు.

పాకిస్థాన్ లో ప్రస్తత తీవ్ర  సంక్షోభానికి ఆర్థిక కారణాలతో పాటు అంతర్జాతీయ యుద్ధ వాతావరణం కూడా ఉంది. గ్యాస్ దిగుమతులు తగ్గడం, ఉన్న కొద్దిపాటి సరఫరాను ప్రభుత్వం క్రమబద్ధీకరించలేకపోవడంతో బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. సామాన్యులు సిలిండర్లను కొనుగోలు చేయలేని ధరలు ఉండటంతో, తక్కువ ఖర్చుతో కూడిన ఇటువంటి ప్రమాదకర మార్గాలను ఎంచుకుంటున్నారు.

ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక చోట్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగినట్లు సమాచారం అందుతోంది. ప్రజల ప్రాణాలతో సంబంధం ఉన్న ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రానున్న రోజుల్లో వంట గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ప్రజలలో ఆందోళన మరింత పెరుగుతోంది.  సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా గ్యాస్ నిల్వ చేయడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కరాచీ వీధులు అగ్నిగుండాలుగా మారే ప్రమాదం పొంచి ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...