నగరం లాంటి నరకాన్ని మళ్ళీ సృష్టించొద్దు!
posted on: Jul 7, 2014 4:34PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమలో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ అనకొండ రెండు పదులకు పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న దుర్ఘటన రాష్ట్ర ప్రజల స్మృతిపథం నుంచి ఇంకా తొలగిపోలేదు. పల్లె ప్రజల మీద పగబట్టిన తాచులాగా విషాగ్నిని చిమ్మిన గ్యాస్ పైప్ లైన్ ప్రమాదం ఎప్పటికీ మరచిపోలేని విషాదం. ఇలాంటి విషాద సంఘటన మరోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత మన రాష్ట్రం నుంచి గ్యాస్‌ని తరలించుకపోతున్న సంస్థల మీద వుంది. సదరు సంస్థలను నియంత్రించాల్సిన ప్రభుత్వాల మీద కూడా వుంది. ఇప్పుడు కోనసీమ ప్రజలు పల్లెపల్లెలో విస్తరించి వున్న గ్యాస్ పైప్ లైన్లను చూస్తేనే భయంతో వణికిపోతున్నారు. ఏ పైప్ లైన్ ఎప్పుడు పగులుతుందో, మళ్ళీ ఏ విధ్వంసాన్ని సృష్టిస్తుందోనని భయపడుతున్నారు. వారి భయానికి తగ్గట్టుగానే కోనసీమలోని అనేక గ్యాస్ పైప్ లైన్లు తుప్పుపట్టి అవసానదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అలాంటి పైపులను వెంటనే మార్చాల్సిన గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు ఇప్పటికీ స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే, కోనసీమ ప్రజలు భయపడుతున్నట్టుగానే అక్కడ అడపా దడపా గ్యాస్ లీకేజీ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కాకినాడ సమీపంలోని సర్పవరం ప్రాంతంలో ఒక గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు గ్యాస్ సంస్థ అధికారులకు సమాచారం అందించడంతో సదరు సంస్థ సిబ్బంది హుటాహుటిన వచ్చి గ్యాస్‌ని ఆపినట్టు సమాచారం. ఇక్కడ గ్యాస్ లీక్ అవడాన్ని స్థానికులు గమనించడం వల్ల మరో పెద్ద ప్రమాదం తప్పింది. ఇలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయినా గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు స్పందించాలి. కాలం చెల్లిన గ్యాస్ పైప్‌లైన్లను మార్చాలి. మరోసారి ‘నగరం’ గ్రామం లాంటి నరకాలను సృష్టించకుండా వుండాలి.



.jpg)
.jpg)

.webp)



