ఏపీ ప్రభుత్వానికి గన్నవరం రైతులు షాక్

 

రాజధాని నిర్మాణానికి భూసేకరణ కోసం తిప్పలుపడుతున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి గన్నవరం మండలంలో రైతులు ఊహించని విదంగా పెద్ద షాక్ ఇచ్చారు. గన్నవరంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలనే ఆలోచనతో కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో 417 ఎకరాల భూసేకరణకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆ మండలంలో గల అన్ని గ్రామాల రైతులు తమకు కూడా తూళ్ళూరు రైతులకు ఇస్తున్నటువంటి ప్యాకేజీయే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వ రేట్ ప్రకారం ధర చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అప్పుడు రైతులు కూడా భూసేకరణం చట్టంలో ఉన్న నియమనిబంధనలను తెలివిగా ఉపయోగించుకొని తమ భూములను ప్రభుత్వ ధర కంటే రెట్టింపు ధరతో రిజిస్ట్రేషన్లు చేయించుకొంటున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 60వేలు ఉన్నట్లయితే, రైతులు దానిని 1.20 లక్షలకి రిజిస్ట్రేషన్ చేయించుకొంటున్నారు.

 

భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయబడిన ధరను రైతులకు చెల్లించినపుడే వారి భూములు స్వాధీనం చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాక ఆ కారణంగా వారు కోల్పోయిన ఇల్లు, ఫలసాయం ఇచ్చే చెట్లు, ఉపాధి వంటివాటికీ రాష్ట్ర ప్రభుత్వమే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు. కనుక అప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా తూళ్ళూరు మండలంలో రైతులకు ఇస్తున్న ప్యాకేజీనే ఇవ్వవలసిఉంటుంది. లేదా భూసేకరణ సంగతి ఇక మరిచిపోక తప్పదు.

 

ఈ విధంగా రైతులు ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కల్పించారు. విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం సహాయం చేస్తానని హామీ ఇచ్చింది కనుక భూసేకరణకు అవసరమయిన ఈ సొమ్మును కేంద్రాన్నే సమకూర్చమని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు స్థానిక యం.యల్యే. వల్లభనేని వంశీ తెలిపారు. అయితే ఏ సంస్థ నిర్మాణానికయినా, భూమిని ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది కనుక కేంద్రం కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయకపోవచ్చును. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో భూసేకరణ ఏవిధంగా చేస్తుందో వేచి చూడాలి.