జగన్మోహన్ రెడ్డికి ముద్దు ప్రశ్న?

 

ఓటుకి నోటు కేసులో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంతగా రెచ్చిపోయారో అందరికీ తెలుసు. ఆయన శ్రమ అనుకోకుండా డిల్లీ వెళ్లి రాష్ట్రపతి, హోంమంత్రి, ఆర్ధికమంత్రి చివరికి ఇందన వనరుల శాఖామంత్రి పీయూష్ గోయల్ కి కూడా ఈ వ్యవహారం గురించి పిర్యాదు చేసి వచ్చారు. కానీ చివరికి మళ్ళీ నిరాశే ఎదురయింది. అంతేకాక ప్రజలెన్నుకొన్న తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు పొరుగు రాష్ట్రంలో రాజకీయపార్టీతో చేతులు కలిపి కుట్రలు పన్నారనే తెదేపా నేతల ఆరోపణలకు సంజాయిషీలు చెప్పుకోవలసిన దుస్థితి ఏర్పడింది.

 

ఓటుకి నోటు కేసులో అంతగా రెచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డి టెలీఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజీనామా చేయాల్సిందే అని వాదించిన జగన్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని రాజీనామా చేయమని ఎందుకు నిలదీయడం లేదు? అని తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణం నాయుడు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసామని ముగ్గురు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు స్పష్టంగా చెప్పిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఆ పార్టీ నేతలెవ్వరూ కూడా దీనిపై ఎందుకు స్పందించడం లేదు? టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదని జగన్ భావిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.