గాజర్ల రవి మృతదేహం కోసం సోదరుడి పడిగాపులు.. పోలీసుల తీరుపై ఆగ్రహం

ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం (జూన్ 18) జరిగిన ఎన్ కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత గాజర్ల రవి మృతదేహం కోసం ఆయన సోదరుడు, మాజీ నక్సల్ గాజర్ల అశోక్ రంపచోడవరం ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే ఆయన గాజర్ల రవి మృతదేహాన్ని అప్పగించడం మాట అటుంచి కనీసం చూడడానికి కూడా పోలీసులు అనుమతించకపోవడంపై అశోక్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే  అదే ఎన్ కౌంటర్ లో మరణించిన అరుణ మృతదేహం కోసం వచ్చిన వారి బంధువులకు కూడా ఇదే అనుభవం ఎదురైంది.   గాజర్ల రవన్న అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అరుణక్క కుటుంబ సభ్యులు రంపచోడవరంహాస్పిటల్‌ వద్దకు బుధవారం (జూన్ 18) అర్ధరాత్రి చేరుకున్నారు.

అప్పటి నుంచీ పడిగాపులు కాస్తున్నా మృతదేహాలను కనీసం చూడనివ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై గాజర్ల రవి సోదరుడు గాజర్ల అశోక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అసలు ఎన్ కౌంటర్ పైనే అనుమానాలు ఉన్నాయన్నారు. ముందుగానే అదుపులోనికి తీసుకుని చిత్రహింసలకు గురి చేసి ఉంటారనీ.. ఇప్పుడు మృతదేహాలను చూపిస్తే జరిగిందేమిటో తమకు తెలిసిపోతుందన్న భయంతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.