సమస్యల పరిష్కారానికి టెక్నాలజీయే దిక్సూచి.. చంద్రబాబు

రేపటి తరం భవిష్యత్ కోసం  పాలకులు,  పారిశ్రామిక వేత్తలు సరైన సరైన వేదికలను సిద్దం చేయాలనీ, అది బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు.  ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని రెండు పురస్కారాలతో సత్కరించిన సంగతి తెలిసిందే. లండన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు తన ప్రసంగంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ కార్పొరేట్ ప్రపంచానికి 35 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నందుకుఅభినందించారు.  ప్రతిష్టాత్మక సంస్థగా ఐవోడీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందనీ, అటువంటి సంస్థ తన సతీమణి నారా భువనేశ్వరి సేవలను గుర్తించి అవార్డు ప్రదానం చేయడం సంతోషంగానూ, గర్వంగానూ ఉందని చంద్రబాబు అన్నారు.   

 ప్రపంచంలో  వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు, సంస్థలు  తమ తమ ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలన్న చంద్రబాబు. భౌగోళిక, రాజకీయ మార్పులతోపాటు వాతావరణ సంక్షోభాలను అధిగమించాలనీ, ఇందుకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 1990లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్తుపై సందేహాలు ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను బిల్ గేట్స్ ను ఆహ్వానించి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించేందుకు చొరవ తీసుకున్నానని గుర్తు చేశారు. ఇప్పుడు, భారతీయులు, ప్రత్యేకించి తెలుగు వారు గ్లోబల్ ఐటీ రంగంలో  కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇందుకు నాడు తాను వేసిన పునాదే దోహదం చేసిందని చంద్రబాబు చెప్పారు.

ఇప్పుడు  ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  వేగంగా విస్తరిస్తోందన్న ఆయన భవిష్యత్ అంతా ఏఐ చుట్టూ తిరిగే సూచనలే కనిపిస్తున్నాయన్నారు. అందుకు అనుగుణంగా  ఆలోచనలు చేయాలనీ, ఏపీలో తాము ఆ దిశగానే విధానాలను... ప్రణాళికలను రూపొందించుకుంటున్నామని చెప్పారు. గూగుల్ తన అతిపెద్ద ఏఐసెంటర్ ను అమెరికా వెలుపల విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందన్న ఆయన ఇది ఏపీలో ఇన్నోవేషన్స్, రీసెర్చ్, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి అంశాల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.  

టెక్నాలజీతో ప్రజలకు  మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వాలు ముందుకు సాగాలనీ, ఏపీలో తాము అదే చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను బెంబేలెత్తించిన మొంథా తుపానును సాంకేతికత సహకారంతోనే దీటుగా ఎదుర్కొని, నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించగలిగామని వివరించారు.  పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేలా 700కు పైగా పౌర సేవలను నేరుగా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చిచనట్లు చెప్పారు.  ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ క్లైమేట్ ఛేంజ్ అన్న చంద్రబాబు దీనిని సమష్టిగా ఎదుర్కొవాలన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu