ఏపీలో ఇంధన సంక్షోభం .. ఇండియన్ అయిల్ కార్పరేషన్‌దే!

posted on: Apr 28, 2026 4:11PM

 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓపీఎల్) ఏకపక్ష వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డిజిల్ సంక్షోభం తలెత్తిందని తేలింది. గతేడాది కంటే అదనంగా ఇంధనం సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వానికి, అధికారులకు నమ్మకంగా లెక్కలిచ్చిన పెట్రోలియం సంస్థలు ఆచరణలో మాత్రం రిటైల్ ఔట్‌లెట్లకు పరిమితులు విధించాయి. ఇండెంట్ పెట్టినా వాణిజ్య వినియోగదారులకు డీజిల్ మళ్లిస్తున్నారనే సాకుతో ఇంధనం పంపలేదు. అత్యధిక సరఫరా వాటా కలిగిన ఐఓసీఎల్ కారణంగా రాష్ట్రంలో సరఫరా వ్యవస్థ ఎక్కడిక్కడ దెబ్బతిందంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని కొరత ఒక్క ఏపీలోనే తలెత్తడానికి ఐఓసీఎల్ తీరే కారణమంట. 

సరఫరాపై పెట్రోలియం సంస్థల లెక్కల్ని గుడ్డిగా నమ్మి, సమస్యను పట్టించుకోని పౌరసరఫరాల శాఖ తీరు కూడా తీవ్ర విమర్శల పాలవుతోంది. డీజిల్ దొరకడం లేదన్న ప్రచారంతో వాహనదారులు బంకుల దగ్గర బారులు తీరారు. బంకులపై ఒత్తిడి పెరిగి, రెండు రోజుల పాటు విక్రయించాల్సిన డీజిల్ ఒక్క పూటకే అయిపోయింది. దాంలెతో స్టాక్ లేక ఎక్కడికక్కడ బంకులు మూతపడ్డాయి. అయినా పెట్రోలియం సంస్థలు 421 బంకులే మూతపడ్డాయని చెప్పిన లెక్కలను పౌరసరఫరాల శాఖ గుడ్డిగా నమ్మి సమస్య తీవ్రతను అంచనా వేయలేకపోయింది. భారీ ప్రాజెక్టులు నిర్వహించే సంస్థలకు సొంతగా బంకులు ఉంటాయి, పెట్రోలియం సంస్థల నుంచి నేరుగా కొనుక్కుని వినియోగిస్తుంటారు. 

అయితే యుద్దం నేపధ్యంలో వారికి సరఫరా చేసే డీజిల్ ధర భారీగా పెరిగింది. సాధారణ బంకుల్లో రూ,96కి కాస్త అటుఇటుగా ఉంటే లీటరు డీజిల్ ధర భారీ సంస్థల బంకుల్లో రూ.152కి చేరింది. దాంతో ఆ వినియోగదారులు రిటైల్ ఔట్‌లెట్లలో కొంటున్నారని, అందుకే అక్కడ డీజిల్ నిల్వలు త్వరగా అయిపోతున్నాయని పెట్రోలియం సంస్థలు సరఫరాలకు పరిమితులు విధించాయి. అది ఐఓసీఎల్ ఏకపక్ష నిర్ణయం అంటున్నారు. ఔట్‌ లెట్లకు సరఫరా నిలిపేస్తే ఆ ఒత్తిడి పక్క బంకులపై పడి, సంక్షోభం తలెత్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించి, రాష్ట్రవ్యాప్యంగా ఇంధన సమస్యలకు కారణమయ్యారు.

ప్రైవేటు పెట్రోలియం సంస్థలైన నయార, జియో, షెల్ సంస్థలకు ఏపీలో 300కి పైగా ఔట్‌లెట్లు ఉన్నాయి. అవి ఫిబ్రవరి వరకు ప్రభుత్వ రంగ సంస్థల కంటే తక్కువ ధరకే బల్క్‌గా సరఫారా చేశాయి. దాంతో పెద్దపెద్ద ప్రాజెక్టులు చేస్తున్న సంస్థలు కూడా వీరి నుంచే కొన్నాయి. యుద్దం మొదలయ్యాక ఇంధన ధరలు పెరగడంతో ప్రైవేటు కంపెనీలు అమ్మకాల్ని తగ్గించుకుంటూ వచ్చాయి. దాంతో బల్క్ వినియోగదారులతా ప్రభుత్వ రంగ సంస్థల ఔట్‌లెట్ల నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించడంతో కొరత తీవ్రమైందంటున్నారు.

మొత్తానికి ఇంధన సరఫరాపై పౌరసరఫరాల శాఖ పర్యేవేక్షణ లోపమే కారణమంటున్నారు. డీజిల్‌ను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారంటూ పెట్రోలియం సంస్థలు ఔట్‌లెట్లకు కోత పెట్టాయి. బంకులకు సరఫరా పూర్తిగా నిలిపేసిన తర్వాతే పౌరసరఫరాల శాఖ దృష్టికి తీసుకెళ్లాయి. అప్పుడు కూడా ఆ శాఖ స్పందించలేదని, సరఫరా కొనసాగించాలని పెట్రో సంస్థలకు స్పష్టం చేయడంతో పాటు, బల్క్ వినియోగంపై డీలర్లతో చర్చించి ఉంటే సమస్య ఇంత తీవ్రమయ్యేది కాదంటున్నారు. ఏదేమైనా అటు పెట్రోలియం సంస్థలుచ ఇటు పౌరసరఫరాలశాఖ నిర్లక్షాలే ఏపీలో ఇంధన సంక్షోభానికి కారణంగా కనిపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...