శ్రీచరణికి రూ. రెండున్నర కోట్లు ప్లస్ గ్రూప్ వన్ జాబ్
posted on Nov 7, 2025 2:07PM
.webp)
విమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో తన అద్భుత ఆటతీరులో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు అమ్మాయి శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, సొంత జిల్లా కడపలో వెయ్యి చదరపు గజాల ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపీ సీఎంఓ ట్వీట్ చేసింది. అలాగే మంత్రి నారా లోకేష్ శ్రీచరణికి ప్రభుత్వం ప్రకటించిన వరాల జల్లును సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. శ్రీచరణి మహిళల వరల్డ్ కప్ లో భారత జట్టును విజేతగా నిలబెట్టేందుకు ప్రదర్శించిన అంకిత భావం రాష్ట్రాన్నే కాకుండా దేశాన్ని కూడా గర్వపడేలా చేసిందని లోకేష్ పేర్కొన్నారు. ఆమెను ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం, రెండున్నర కోట్ల రూపాయల నగదు బహుమతి, కడపలో నివాస స్థలంతో సత్కరిస్తుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతకుముందు శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో శ్రీచరణిని అభినందించిన చంద్రబాబు, ప్రపంచకప్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ ప్రశంచించారు. శ్రీచరణి అద్భుత ఆట, ఆమె విజయం యువ మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ... ప్రపంచకప్ గెలిచిన తర్వాత దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి సంతోషంగా ఉందని తెలిపారు. తన కుటుంబం అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు. ఈ విజయం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక, శుక్రవారం (నవంబర్ 7) సాయంత్రం కడపలో ఏసీఏ, కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీచరణికి భారీ సన్మాన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించనుంది.