క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్ : సీఎం చంద్రబాబు
posted on: Feb 7, 2026 7:05PM

అమరావతిలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఈ రోజు అమరావతికే కాదు, ఆంధ్రప్రదేశ్‌కే కాదు, భారతదేశానికే ఒక చారిత్రాత్మక దినమని సీఎం అన్నారు.ఈ రోజు కేవలం క్వాంటం వ్యాలీ భవనాలకు మాత్రమే పునాది వేయడం లేదు… గ్లోబల్ క్వాంటం రెవల్యూషన్‌లో భాగమయ్యే నిపుణులకు కూడా పునాది వేస్తున్నాం” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఐక్య రాజ్యసమితి కూడా ఈ సంవత్సరాన్ని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ’గా ప్రకటించిందని గుర్తు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా క్వాంటం ట్రాన్సిషన్ మూమెంట్‌గా నిలిచిపోతుందని తాను భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో క్వాంటం టెక్నాలజీ ఒక కీలక ముందడుగు అవుతుందని సీఎం స్పష్టం చేశారు.
.webp)
గతంలో వచ్చిన వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాలను భారత్ పూర్తిగా అందిపుచ్చుకోలేకపోయిందని, కానీ ఐటీ విప్లవంలో మాత్రం మనం ముందడుగు వేశామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించటం ఓ గేమ్ చేంజర్‌గా మారి ఫలితాలు ఇస్తోందని అన్నారు.హైటెక్ సిటీ తరహాలోనే క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తాం. భారత్‌లో ఏర్పాటు చేస్తున్న తొలి అమరావతి క్వాంటం వ్యాలీని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించడం గర్వకారణం. ఇది కూడా ఒక విప్లవంగా మారుతుంది” అని సీఎం తెలిపారు.సాంకేతిక విప్లవాన్ని ఆచరించే ప్రధాని నరేంద్ర మోదీ బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని, ఈ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో 6జీ కమ్యూనికేషన్ కూడా సాధ్యమవుతుందని సీఎం తెలిపారు.

భారత్ నుంచి వేర్వేరు ఉత్పత్తులను ప్రపంచానికి అందించాలనే ఆకాంక్ష తనదని చెప్పారు.గతంలో తాను ఐటీ, సెల్‌ఫోన్ల గురించి మాట్లాడితే విమర్శించిన వారి పిల్లలే ఈ రోజు ఐటీ రంగంలో అమెరికాలో స్థిరపడ్డారని పేర్కొన్నారు. వచ్చే 30–40 ఏళ్లలో ఆచరణలోకి వచ్చే అంశాలపై తాను ఎప్పుడూ ఆలోచిస్తానని, దానికి అనుగుణంగానే ప్రణాళికలు ఉంటాయని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశమే భవిష్యత్తులో అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలకు కేంద్రంగా మార్చుతామని చెప్పారు. క్వాంటం డిజైన్స్, క్వాంటం ఉత్పత్తులు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్‌కు అమరావతి కేంద్రంగా మారుతుందని తెలిపారు.
.webp)
డిఫెన్స్, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఫైనాన్స్, క్లైమేట్ మోడలింగ్ వంటి రంగాల్లో అమరావతి క్వాంటం వ్యాలీలో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతాయని చంద్రబాబు అన్నారు.ఇప్పటివరకు ప్రపంచం అంతా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గురించే మాట్లాడింది. ఇక నుంచి అమరావతిలోని క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడతారు” అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంతో రాజధాని నిర్మిస్తున్నామని, దీనిలో రైతులే ప్రధాన భాగస్వాములని చెప్పారు. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్‌గా తయారవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచశ్రేణి క్వాంటం టెక్నాలజీ నగరంగా అమరావతి మారుతుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భారత్‌లో తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.






