వైకాపాలో చేరనున్న దాసరి నారాయణ రావు

posted on: Jan 5, 2016 7:01PM

 

మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు వైకాపాలో చేరబోతున్నారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇవ్వాళ్ళ తన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ లోని దాసరి నారాయణ రావు నివాసానికి వెళ్లి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అది కేవలం మర్యాదపూర్వక సమావేశమే అని దాసరి నారాయణ రావు చెప్పుకొన్నప్పటికీ, ఆయన వైకాపాలో చేరబోతున్నట్లు వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దృవీకరించారు.

 

ఈ సందర్భంగా దాసరి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై జగన్మోహన్ రెడ్డి నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజలలో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. నాకు ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డితో కూడా మంచి అనుబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా గొప్ప నాయకుడిగా ఎదగాలని నేను కోరుకొంటున్నాను. ఆయనకి నా ఆశీసులు ఎప్పుడూ ఉంటాయి,” అని అన్నారు.

 

దాసరి నారాయణ రావుని ఇంత అకస్మాత్తుగా వైకాపాలో చేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకోవడం అందుకోసం ఆయన స్వయంగా దాసరి ఇంటికి వెళ్లి కలవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కాపు సామాజిక వర్గాన్ని  వైకాపా వైపు తిప్పుకోవాలని జగన్ మోహన్ రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ వంటి నేతలు అనేకమంది పార్టీలో ఉన్నారు. దాసరిని కూడా చేర్చుకొంటే ఆ వర్గానికి చెందిన పెద్దమనుషులు అనేకమంది వైకాపాలో చేరేందుకు ఆసక్తి చూపిస్తారని జగన్ భావిస్తున్నారేమో? 

google-ad-img
    Related Sigment News
    • Loading...