హమ్మయ్య! బొగ్గు మసి వదిలింది
posted on Apr 9, 2015 10:16AM
.jpg)
బొగ్గు గనుల అక్రమ కేటాయింపుల కుంభకోణంలో స్వయంగా విచారణకు హాజరుకమ్మని సీబీఐ ప్రత్యేక కోర్టు నుండి నోటీసులు అందుకొన్న మాజీ ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్, తనపై పెట్టిన కేసుల విచారణను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషను వేశారు. దానిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఆయనపై పెట్టిన కేసులన్నిటిపై స్టే విధించడంతో ఈరోజు ఆయన సీబీఐ కోర్టు బోనులో నిలబడి సంజాయిషీలు ఇచ్చుకొనే కష్టం, అవమానం తప్పింది. ఇక మరో విశేషం ఏమిటంటే, ఆయనతో బాటు బొగ్గు శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి పిసి ఫారెక్, కుమారా మంగళం బిర్లా తదితరులు వేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సి.నాగప్పన్ మరియు వి.గోపాల గౌడలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వారికీ స్టే మంజూరు చేసింది. అంతేకాదు వారి పిటిషన్లను విచారణకు ‘అడ్మిట్’ చేస్తున్నట్లు పేర్కొనడం ద్వారా వారందరికీ మరొక మూడేళ్ళ వరకు ఈ కేసుల బాధ నుండి విముక్తి కల్పించింది.
న్యాయ పరిబాషలో ఏ కోర్టయినా పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నప్పుడు ‘అడ్మిట్’ లేదా ‘గ్రాంట్ ఆఫ్ లీవ్’ అనే పదాలు వాడినట్లయితే ఆ కేసులు కనీసం మూడేళ్ళపాటు పక్కన బెట్టినట్లేనని న్యాయశాఖ నిపుణులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా వారి పిటిషన్లను ‘అడ్మిట్’ చేస్తున్నట్లు తెలిపింది. ధర్మాసనం తన అడ్మిట్ నిర్ణయానికి కారణాలు వివరిస్తూ “ఈ పిటిషన్లు వేసిన వ్యక్తులు అవినీతి నిరోధ చట్టం 1988లో సెక్షన 13(1) (డి) (3) పై లేవనెత్తిన కొన్ని చట్ట సంబంధమయిన ప్రశ్నలను లోతుగా పరిశీలించవలసి ఉంది గనుక ఈ కేసులను ‘అడ్మిట్’ చేయడమయిందని ప్రకటించింది. కనుక అంతవరకు డా.మన్మోహన్ సింగ్ తో సహా అందరిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో నమోదు చేయబడిన కేసుల విచారణను నిలిపివేయడమే కాక వారికి కనీసం మరో మూడేళ్ళవరకు ఈ కేసుల బాధ నుండి విముక్తి కల్పించింది. కనుక డా.మన్మోహన్ సింగ్ బొగ్గు మసి వదిలించుకొన్నందుకు ఆయన, ఆయనతో బాటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సంతోషపడవచ్చును.