మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల ఈ-వేలం మార్చి 24న

posted on: Feb 21, 2026 10:00AM

మాజీ ఎంపీ బుట్టా రేణుక ,  ఆమె భర్త నీరుకర్ శివ ప్రసాద్‌కు చెందిన ఆస్తుల ఈ-వేలం ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో తీసుకున్న భారీ రుణాన్ని చెల్లించకపోవడంతో ఎల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ రంగంలోకి దిగింది. బకాయిల వసూళ్ల కోసం పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎ  స్పందన లేకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్  నిర్ణయించింది.

ఆ సంస్థ వర్గాల నుంచి అందిన  సమాచారం మేరకు, బుట్టా రేణుక దంపతులు ఎల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సుమారు రూ.340 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ప్రారంభంలో కొంతకాలం వరకూ వాయిదాలు చెల్లించినా ఆ తరువాత  చెల్లిం పులు నిలిపివేశారు. దీంతో  వడ్డీలు, పెనాల్టీలు కలసి మొత్తం బాకీ రూ.782.07 కోట్లకు చేరింది. దీంతో రుణానికి భద్రతగా పెట్టిన ఆస్తులను విక్రయించి బకాయిలను వసూలు చేసుకునేందుకు సంస్థ చర్యలు ప్రారంభించింది.

ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ బెంగళూరు శాఖ పరిధిలోని సర్వే నంబర్ 1009, ఫేజ్–6లో ఉన్న 3,833.28 చదరపు గజాల స్థలాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించ నున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆ స్థలంలో మెరిడియన్ పాఠశాల భవనం ఉండటం గమనార్హం. సంబంధిత ఆస్తి విలువను   రూ.65 కోట్లుగా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది.ఈ-వేలంలో పాల్గొనదలిచిన వారు మార్చి 23లోగా  ఈ-బిడ్ దరఖాస్తులు సమర్పించాలనీ, మార్చి 24న ఈ-వేలం నిర్వహిం చనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వేలం ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా జరుగుతుందని సంస్థ స్పష్టం చేసింది. మాజీ ఎంపీకి చెందిన ఆస్తుల ఈ-వేలం వ్యవహారం కర్నూలు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుండ గా, అనంతరం మరిన్ని ఆస్తులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ విషయంపై మాజీ ఎంపీ నుంచి   స్పందన రావాల్సి ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...