Latest News
మళ్లీ పెళ్లి పీటలెక్కుతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి
posted on: Mar 12, 2026 12:40PM

సర్వ సాధారణంగా పెళ్లి అంటే… ఎవరి కొడుక్కి? ఎవరి కూతురికి? లేదంటే మనవళ్లకా? అని అడగడం సహజం. కానీ ఈసారి మాత్రం కథ కొంచెం భిన్నంగా ఉంది. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో మోగ బోయే పెళ్లి భాజాలు ఎవరి కోసమో తెలుసుకుంటే చాలామంది కాసేపు ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే… ఈ పెళ్లి ఆయన కొడుకుదీ కాదు… కూతురుదీ కాదు… మనవళ్లదీ అంతకంటే కాదు… స్వయంగా మల్లారెడ్డిదేనండోయ్....అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది కొత్త పెళ్లి కాదండోయ్… పాత ప్రేమకు కొత్త ముహూర్తం మాత్రమే. తన జీవిత భాగస్వామి కల్పనతో కలిసి 50 ఏళ్ల దాంపత్య జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆమెను మరోసారి సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలని మల్లారెడ్డి నిర్ణయించారు.
దానికి గాను మార్చి 19న ఘనంగా గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ వేడుక నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకను సాధారణంగా కాకుండా… నిజంగానే కొత్త పెళ్లిని తలపించేలా ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. గురువారం నుంచి మల్లారెడ్డి నివాసంలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతంతో వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం హల్దీ, సంగీత్ వంటి వివాహ వేడుకలకు సంబంధించిన అన్ని కార్య క్రమాలు వరుసగా జరుగనున్నాయి.పెళ్లి అంటే ఎలా ఉండాలో చూపించాలని అనుకున్నారో ఏమో… పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, కొత్త జంటల మాదిరిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి “మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాం… తప్పకుండా రావాలి” అంటూ రాజకీయ, వ్యాపార, సామాజిక రంగా లకు చెందిన అతిరథ మహా రథులను ఆహ్వానించారు.
మార్చి 19న జరిగే ప్రధాన వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆహ్వానాలు పంపించడం ప్రారంభమైంది. పెళ్లి వార్త బయటకు రావడంతో… “మల్లారెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారట!” అంటూ మొదట కాస్త గందరగోళం నెలకొన్నా… అసలు విషయం తెలిసాక చాలామంది నవ్వుకుంటూ “ఇదే నిజమైన ప్రేమకు గోల్డెన్ జూబ్లీ” అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు .మొత్తానికి… సాధారణంగా మనవళ్ల పెళ్లిళ్లు చూసే వయసులో… స్వయంగా మరోసారి పెళ్లి పీటలెక్కి దాంపత్య జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్న మల్లారెడ్డి దంపతులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక మార్చి 19న జరిగే ఈ ప్రత్యేక పెళ్లి వేడుక ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో బాగా కనిపిస్తోంది.






