Latest News

మాజీ డీజీపీ దొర మృతి పట్ల...చంద్రబాబు, రేవంత్‌ సంతాపం

posted on: Mar 13, 2026 5:20PM

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ దొర మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి  సంతాపం వ్యక్తం చేశారు. దొర మరణం రాష్ట్ర పోలీసు శాఖకు తీరని లోటని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో విలువైనవని గుర్తు చేశారు. దొర కుటుంబ సభ్యు లకు తన ప్రగాఢ సానుభూ తిని తెలియజేస్తూ, ఈ దుఃఖ సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన ఒక సమర్థుడైన పోలీసు అధికారి మరణం చాలా బాధాకరమని రేవంత్‌రెడ్డి అన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, అనంతరం డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన దొర తన కర్తవ్యనిష్ఠతో ప్రత్యేక గుర్తింపు పొందారని సీఎం తెలిపారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను మరింత సమ ర్థవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు ఆయన చేసిన కృషి ఎంతో గుర్తించదగ్గదని సీఎం అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్.జె దొర మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏపీ పోలీస్ కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఎన్టీఆర్  దగ్గర ఇంటెలిజెన్స్ అధికారిగా, నా హయాంలో రాష్ట్ర డీజీపీగా దొర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. నాడు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నక్సల్ సమస్య పరిష్కారంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారు. హెచ్.జె దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని చంద్రబాబు తెలిపారు.

1943లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన హెచ్‌జే దొర 1965 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఆయన తన సేవాకాలంలో అనేక కీలక పదవులను నిర్వహించారు. పోలీసు శాఖలో వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆయన 1996లో రాష్ట్ర డీజీపీగా పదోన్నతి పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. అలాగే రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన విశేష కృషి చేశారు .అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్  ఎండీగా, అలాగే హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా కూడా ఆయన సేవలందించారు. 

తన పరిపాలనా అనుభవంతో ప్రజల భద్రత, శాంతి భద్రతల నిర్వహణలో సమర్థంగా పని చేశారు.కేంద్ర స్థాయిలో కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్‌లో విజిలెన్స్ కమిషనర్‌గా పనిచేశారు. అనంతరం 2002లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్  డైరెక్టర్ జనరల్‌గా డిప్యుటేషన్‌పై వెళ్లి సేవలందించారు. దీర్ఘకాలం పోలీసు సేవలో పనిచేసిన హెచ్‌జే దొర తన క్రమశిక్షణ, నిజాయితీ, పరిపాలనా నైపుణ్యంతో మంచి పేరు సంపాదించారు.  దొర తన సుదీర్ఘ వృత్తి జీవితానుభవాలతో 'జర్నీ త్రూ టర్బ్యులెంట్ టైమ్స్' పేరుతో ఆత్మకథను కూడా రచించారు. ఆయన మరణం పోలీసు శాఖకు తీరని లోటుగా భావిస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...