డ్రగ్స్ దందా.. విదేశీ విద్యార్థుల అరెస్టు

posted on: Mar 4, 2026 2:03PM

ఉన్నత చదువుల పేరిట భారత్‌కు వచ్చి డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న విదేశీయుల వ్యవహారం మరోసారి హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. విద్యార్థులుగా నగరంలో ఉంటూ ఒకవైపు చదువులు కొనసాగిస్తూ, మరోవైపు సులభంగా డబ్బు సంపాదించేందుకు మత్తు పదార్థాల వ్యాపారానికి తెరలేపిన ఇద్దరు విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు.  హైదరాబాద్ పోలీసులు,  హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ బృందం విశ్వసనీయ సమాచారంతో  రాజేంద్రనగర్ పరిధిలో  మంగళవారం  సంయుక్తంగా నిర్వహించిన దాడిలో  ఒక అంతర్రాష్ట్ర విదేశీ డ్రగ్ పెడ్లర్‌తో పాటు అతని సహచరుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పాతిక లక్షల విలువైన  150 గ్రాముల ఎండీఎంఏ, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో   కేసు నమోదు చేశారు.  ప్రధాన నిందితుడైన అల్-అకర్ అబ్దురబు యెమెన్ దేశీయుడు  టోలిచౌకిలో నివాసం ఉంటున్నాడు. 2008లో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చి, తరువాత స్టూడెంట్ వీసాపై బి.సి.ఏలో చేరినా మధ్యలోనే చదువు మానేశాడు. అనంతరం 2011లో హైదరాబాద్‌కు వచ్చి సిక్కిం మణిపూర్ యూనివర్సిటీలో చేరాడు. ఆ తరువాత  2015లో మళ్లీ స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చిన ఇతని పాస్‌పోర్ట్ 2020లో గడువు ముగిసింది. విలాసవంతమైన జీవితం కోసం డ్రగ్ వ్యాపారంలోకి దిగాడు.  ఢిల్లీలోని ‘చిడి’ అనే సరఫరాదారుతో సంబంధాలు పెంచుకుని, గతంలో పలుమార్లు అమీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కేసుల్లో అరెస్ట్ అయ్యాడు.  2023లో నమోదైన కేసులో ఇతడిపై నాన్ బెయిలబుల్ వారంట్ పెండింగ్ లో ఉందని పోలీసులు తెలిపారు.  ఇక  పాలస్తీనాకు చెందిన హసన్ డబ్ల్యూ.ఏ. హషీమ్   అనే యువకుడు 

 బెంగళూరులో నివసిస్తు న్నాడు.  2016లో భారత్‌కు వచ్చి బి.సి.ఏ పూర్తి చేశాడు. 2022లో బిజినెస్ వీసాపై మళ్లీ వచ్చి, అదే ఏడాది నవంబరులో 300 గ్రాముల ఎండీఎంఏతో యలహంక న్యూ టౌన్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైలులో అబ్దురబుతో పరిచయం ఏర్పడి, బెయి ల్‌పై బయటకు వచ్చిన తరువాత డ్రగ్స్ రవాణా, నిల్వ, బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలకు సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఇద్దరూ వాట్సాప్ ద్వారా నైజీరియాకు చెందిన సరఫరాదారుల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి, బెంగళూరు,  హైదరాబాద్ నగరాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విక్రయించేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.  డెడ్ డ్రాప్  విధానం,ప్రైవేట్ బస్సుల్లో డ్రగ్స్ పట్టుకొని దర్జాగా వచ్చేవారని పోలీసులు తెలిపారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...