ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై ముమ్మర దర్యాప్తు
posted on: Feb 8, 2026 10:43AM

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాల భద్రత దృష్ట్యా నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌ను పోలీసులు పూర్తిగా సీజ్ చేశారు. ఘటనపై స్పష్టత కోసం ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగుతోంది.అగ్నిప్రమాదం జరిగిన ప్రథమ అంతస్తులోని కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను క్లూస్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాబ్‌లో ఎవరు ఉన్నారు, ఎలా మంటలు చెలరేగాయి అనే అంశాలపై ఎస్బీ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు.
కార్యాలయంలో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌తో పాటు సర్వర్ రూమ్, హెచ్ఆర్డీ హాల్, ఫర్నిచర్ మరియు పలు కీలక పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఉదయం 10:08 గంటల సమయంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాపర్టీ రూమ్‌లో భారీగా పొగ రావడం గమనించామని పేర్కొన్నారు. పొగ ఇతర గదులకు కూడా వ్యాపించినట్లు తెలిపారు. మా ఉద్యోగి సాయి కృష్ణ నుంచి అగ్నిప్రమాద సమాచారం అందగానే వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చినట్లు ఫిర్యాదులో వివరించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఉదయం 10:30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మధ్యాహ్నం 1:30 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికా గోయల్ స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అగ్నిప్రమాదంపై మధ్యాహ్నం 12 గంటలకు ఆమె మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. కీలక కేసులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు ల్యాబ్‌లో ఉండటంతో ఈ అగ్నిప్రమాదం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక మరేదైనా కారణాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక రావాల్సి ఉంది






