అల్లం-వెల్లుల్లి పేస్ట్ పేరుతో ‘పాయిజన్ ప్యాక్’

posted on: Mar 17, 2026 9:48PM

 

హైదరాబాద్‌లో మరోసారి “లాభాల కోసం ప్రాణాల మీద ఆట” బయటపడింది. బయటకు చూస్తే “ఏ వన్ సహారా గోల్డ్ జింజర్ గార్లిక్ పేస్ట్” అంటూ బ్రాండెడ్ లుక్… కానీ లోపల మాత్రం కల్తీ కథ!

బోరబండలో నడుస్తున్న ఈ అక్రమ వ్యాపారం అసలు రూపం బయటపడటంతో ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్‌కు అందిన విశ్వసనీయ సమాచారంతో మధుర నగర్‌లోని గోదాముపై దాడి చేయగా… అక్కడి పరిస్థితులు చూస్తే “ఇది ఫుడ్ ఫ్యాక్టరీనా? లేక చెత్త గోదామా?” అన్న సందేహం కలిగేలా ఉన్నాయి.

ప్లాస్టిక్ డబ్బాల్లో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ… చుట్టూ దుమ్ము, ఈగలు, అపరిశుభ్రత—ఇదే అక్కడి ‘క్వాలిటీ కంట్రోల్’! అంతేకాదు… పేస్ట్‌లో అసిటిక్ యాసిడ్, ఉప్పు కలిపి రుచి పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా మిగిలిపోయిన వెల్లుల్లి తొక్కలనే ముడి పదార్థంగా వాడటం చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.

ఈ కల్తీ పేస్ట్‌ను నగరంలోని హోటళ్లు, కేటరింగ్ సర్వీసులు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తూ… ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి భారీగా లాభాలు ఆర్జిస్తున్నాడు నిందితుడు మహ్మద్ అబ్దుల్లా. పేరుకు FSSAI లైసెన్స్ ఉన్నా… నాణ్యత మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం!

దాడిలో అధికారులు సుమారు రూ. 4.5 లక్షల విలువైన కల్తీ పేస్ట్, ముడి సరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వేల కిలోల వెల్లుల్లి, ఉప్పు బస్తాలు కనిపించడం వల్ల ఇది చిన్న స్థాయి వ్యాపారం కాదని స్పష్టమవుతోంది.ఇలాంటి కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే… “రుచి కోసం కొనేది, ఆరోగ్యానికి ముప్పు అవుతుందేమో” అనే భయం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...